. కుప్పకూలిన భవనాలు
. 32 మంది మృతి… వందలాది మందికి గాయాలు
మనీలా: ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సోమవారం ఉదయం మిండనావో ప్రాంతంలో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం కారణంగా 32 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా… వందలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇది భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతమవడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా శిథిలాల తొలగింపు అనంతరం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భూకంపం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఓ పాఠశాల మైదానంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన భారీ షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. ముందే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:37 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ శాంటోకు నైరుతి దిశగా 13 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌లోని కొన్ని తీర ప్రాంతాల్లో మూడు మీటర్ల వరకు (దాదాపు 10 అడుగులు) ఎత్తున్న సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే టెరెసిటో బకోల్కోల్ వెల్లడించిన వివరాల ప్రకారం సుల్తాన్ కుదరత్, సంరగాని ప్రావిన్సుల్లో సుమారు ఒక మీటర్ (మూడు అడుగులు) ఎత్తున్న సునామీ అలలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిన్న స్థాయి సముద్ర అలల మార్పులు కనిపించాయి. ఈ విపత్తుపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా స్పందించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ఆదేశించారు. ఆస్తుల కంటే ప్రాణాలే అత్యంత విలువైనవని, ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు మిండనావో పరిధిలోని ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే దేశాల్లో ఒకటి. ఇది పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన పసిఫిక్ రింగ్ ఆఫ్ పైర్ అనే ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అంతేకాకుండా ఏటా సుమారు 20 వరకు తుపాన్లు, ఉష్ణమండల తుపాన్ల ప్రభావాన్ని కూడా ఈ దేశం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.


