ప్రజాసమస్యలే అజెండాగా మోదీ సర్కారుపై పోరాటం
. తక్షణం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
. ఆర్థిక, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై అఖిలపక్ష సమావేశం
. ఇండియా ఐక్య సంఘటన డిమాండ్
. ఎసఐఆర్ లోపాలు.. ‘ఓట్ల దోపిడీ’పై సీజేఐకి లేఖ
. పార్లమెంట్లో ఐక్యగళం
. ఆగస్టులో హైదరాబాద్‌లో తదుపరి సమావేశం
. దిల్లీ ‘ఇండియా’ భేటీలో కీలక నిర్ణయాలు
. 25 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరు
న్యూదిల్లీ: దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ అందరం కలిసి అడుగులు వేయాలని ఇండియా ఐక్యసంఘటన భాగస్వామ్యపక్షాలు నిర్ణయించాయి. రెండేళ్ల తర్వాత దిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సోమవారం సమావేశమైన ప్రతిపక్ష నేతలు బీజేపీ, మోదీసర్కారుపై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని నిర్ణయించారు. నీట్-యూజీ, సీబీఎసఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకొని, వారి నమ్మకాన్ని వమ్ము చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, దేశంలో ప్రస్తుతం నెలకొన్న క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇండియా ఐక్యసంఘటన డిమాండ్ చేసింది. ఇక ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎసఐఆర్) ప్రక్రియలో జరిగిన లోపాలు, ‘ఓట్ల దోపిడీ’ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించింది. దేశ రాజధాని దిల్లీలో సోమవారం ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నేత జాన్ బ్రిట్టాస్, ఎన్సీపీ (ఎస్పీ) నాయకురాలు సుప్రియా సూలే, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సహా 23 పార్టీల నేతలు హాజరయ్యారు. కాగా, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, అలాగే జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఇండియా ఐక్య సంఘటన సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మీడియాతో మాట్లాడుతూ… ‘ఇండియా’ తీసుకున్న ఐదు కీలక నిర్ణయాలను వివరించారు. ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎసఐఆర్) ప్రక్రియలో జరిగిన లోపాలు, ‘ఓట్ల దోపిడీ’ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ లేఖను వీలైనంత త్వరగా ఆయనకు అందజేయనున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హయాంలోనే నీట్, సీబీఎసఈ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని…దీనివల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు రోడ్డున పడిందని మండిపడ్డారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. దేశంలోని తీవ్ర ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, రైతుల సమస్యలపై ఐక్యసంఘటన నిరంతర పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఇక నుండి ఇండియా ఐక్యసంఘటనలోని భాగస్వామ్య పక్షాలు ఇకపై ప్రతి రెండు నెలలకోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు Uడ్గే తెలిపారు. ఇందులో భాగంగా తదుపరి కూటమి సమావేశాన్ని వచ్చే ఆగస్టులో హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీని త్వరలోనే ఖరారు చేస్తారు. ఇక రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలని ‘ఇండియా’ భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. ఇందుకోసం పార్లమెంట్ జరుగుతున్న ప్రతిరోజు ఉదయం లోక్‌సభ ప్రతిపక్ష నేత కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
సోదరభావంతో కలిసి పనిచేయాలి: అఖిలేశ్ యాదవ్
ఈ సమావేశానికి ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ… కూటమిలోని పార్టీలు అన్నీ సోదర భావంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తమ కూటమి కన్ను 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఉందని పేర్కొన్నారు. “మన కూటమిలో బంధు రాజ్ (సోదరభావం) ఏర్పడాలి. ఉత్తరప్రదేశ్‌లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు కూడా వారిపై కోపంగా ఉన్నారు. అందుకే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం చాలా అవసరం” అని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇక ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ… ‘ప్రస్తుతం భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి విపరీతంగా ఉన్నాయి’ అని విమర్శించారు.
డీలిమిటేషన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం: ఖడ్గే
ఇండియా ఐక్యసంఘటన అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సమావేశంలో ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంటులో రాజ్యాంగ (131 సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను ఓడించడంలో కూటమి కనబరిచిన ఐక్యతను ఖడ్గే ప్రశంసించారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లను ప్రస్తావించారు. ఎసఐఆర్ పేరుతో లక్షలమంది ఓటు హక్కులను కాలరాస్తున్నారని, దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, పరీక్షల వ్యవస్థ వైఫల్యం వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఖడ్గే ఆందోళన వ్యక్తం చేశారు. “ఇండియా కూటమి నాయకుల ఈ సమావేశానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ కూటమి మూడేళ్ల క్రితం ఏర్పడింది. మన ముందున్న సమస్యలు మీ అందరికీ బాగా తెలుసు. అందుకే కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడదలచుకోలేదు. 2026 ఏప్రిల్ 17న లోక్‌సభలో మనమందరం ఏకమై, డీలిమిటేషన్‌పై మోదీ ప్రభుత్వ దురుద్దేశపూర్వక బిల్లులను ఓడించి, మన ఐక్యతను,సంఘీభావాన్ని చాలా నిర్ణయాత్మకంగా ప్రదర్శించాము” అని అన్నారు.
The post కలిసి నడుద్దాం appeared first on Visalaandhra.


