గూగుల్ డేటా సెంటర్ భూముల వివాదం.. రైతులకు పరిహారం లేకుండానే భూమి పూజ..! google data center land compensation dispute farmers anger. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ భూములపై పరిహారం లేక రైతుల ఆందోళన, సిపిఎం నేతల ధర్నా, అరెస్టులు, పూర్తి నష్టపరిహారం వరకు ప్రాజెక్ట్ నిలిపివేయాలని డిమాండ్

+

గూగుల్

గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరహారంపై ఆందోళన

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు చేపట్టిన ధర్నా తీవ్ర ఆగ్రహాన్ని ప్రతిబింబించింది. డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయిన 520 మంది రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన రాయితీలు, నష్టపరిహారం ఇప్పటికీ పూర్తిగా అందలేదని వారు ఆరోపించారు.

ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో, రైతులకు న్యాయం చేయకుండా శంకుస్థాపనకు వెళ్లడం అన్యాయమని సిపిఎం నేతలు మండిపడ్డారు. భూమి పూజకు ముందే పూర్తి పరిహారం చెల్లించకపోతే డేటా సెంటర్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు అండగా తాము నిలుస్తామని సిపిఐ నాయకుడు లోకనాథం స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తర్లువాడ గ్రామంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. డేటా సెంటర్ కోసం భూములు కోల్పోయి ఇంకా పరిహారం అందని రైతులను కలవడానికి వెళ్తున్న సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్ బి గంగారావు, ఆర్ఎస్ఎన్ మూర్తిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ చర్యను సిపిఎం విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.

గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూముల్లో చాలా భాగం బంజరు భూమిగా ఉన్నప్పటికీ, సంవత్సరాలుగా సాగు చేసి జీవనోపాధి పొందుతున్న రైతులు ఉన్నారని నేతలు పేర్కొన్నారు. అలాంటి రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమ్మతి లేకుండా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తర్లువాడ గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించగా, రైతులను కలవడానికి వచ్చిన ప్రతిపక్ష నేతలను కూడా అడ్డుకోవడం వివాదాస్పదమైంది. సిపిఎం నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

రైతుల పక్షాన నిలిచే నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సిపిఎం నేతలు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు మద్దతుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తూ, 601 ఎకరాల భూమిని గూగుల్ సెంటర్ పేరుతో అప్పగించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. రైతులకు పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *