ఇసుక వేస్తే రాలనంత జనం.. మందపల్లి శనీశ్వర క్షేత్రంలో ఉద్రిక్తత.. ఆలయం మూసివేత..! Shani Jayanti Mandapalli temple crowd | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

మందపల్లిలో మూసేసిన శనేశ్వర స్వామి ఆలయం.. దర్శనం చేసుకునే వెళ్తామంటున్న భక్తులు

+

News18

News18

శనీశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినంగా భావించే శని జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లి మందేశ్వర స్వామి దివ్య క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణం, శని జయంతి రోజున మాత్రం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది. శనివారం సాయంత్రానికి పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చగా, ఆలయం పరిసరాల్లో ఇసుక వేస్తే రాలనంతగా జనసందోహం కనిపించింది.

శనీశ్వర స్వామిని ఈ ఒక్కరోజు దర్శించుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని, కష్టాలు దూరమవుతాయని భక్తులు గాఢ విశ్వాసంతో భావిస్తారు. అందుకే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు మందపల్లికి తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తైలాభిషేకాలు నిర్వహించేందుకు పెద్దఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే ఊహించని స్థాయిలో భక్తులు రావడంతో దేవస్థానం అధికారులు పూర్తిగా ఒత్తిడికి గురైనట్లు కనిపించింది.

రద్దీ అదుపు తప్పే పరిస్థితులు కనిపించడంతో ఆలయ ప్రధాన గేట్లను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఎంతో దూరం నుంచి వచ్చాం.. స్వామి దర్శనం తప్పనిసరి అంటూ భక్తులు వెనక్కి తగ్గలేదు. కొందరు గేట్లు దూకగా, మరికొందరు గోడలపైకి ఎక్కి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం అక్కడ కలకలం రేపింది. ఈ దృశ్యాలు చూసిన పలువురు భక్తులు భయాందోళనకు గురయ్యారు.

ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి లైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్శనం కోసం వేచి చూసినా ముందుకు కదలలేకపోతున్నామని, తాగునీరు, సరైన క్యూలైన్ నిర్వహణ, భద్రతా చర్యలు తగిన స్థాయిలో లేవంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు భక్తులు అయితే ఇంత పెద్ద పండుగకు సరైన ఏర్పాట్లు చేయాల్సింది అంటూ దేవస్థానం అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భలే ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే గారు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా వినిపించాయి.

ప్రతి ఏడాది శని జయంతికి మందపల్లి క్షేత్రానికి భారీగా భక్తులు వస్తారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈసారి వచ్చిన రద్దీని అంచనా వేయడంలో అధికారులు విఫలమైనట్లు కనిపిస్తోంది. మరోవైపు ఆలయ పరిసరాల్లో పోలీసులు, సిబ్బంది భక్తులను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, జనసందోహం కారణంగా పరిస్థితులు అదుపులోకి రావడం కష్టంగా మారింది. ఏది ఏమైనా శని జయంతి సందర్భంగా మందపల్లి మందేశ్వర స్వామి క్షేత్రంలో కనిపించిన ఈ దృశ్యాలు భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచినా, భవిష్యత్తులో ఇలాంటి సందర్భాల్లో మరింత పటిష్టమైన ఏర్పాట్లు అవసరమనే చర్చ మాత్రం బలంగా వినిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *