హోర్మూజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
వాషింగ్టన్: ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా సీజ్ చేసింది. దీనితో హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి, ఆ నౌకను స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఈఘటన చోటుచేసుకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు.‘ఇరాన్ పతాకంతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న రవాణా నౌక తౌస్కా మా నౌకాదళ దిగ్బంధాన్ని దాటుకొని వెళ్లాలనుకొంది. కానీ, అది అనుకొన్నది సజావుగా సాగలేదు. అమెరికా నౌకాదళ డెస్ట్రాయర్ వార్నింగ్ షాట్లతో దానిని గల్ఫఆఫ్ ఒమన్‌లో అడ్డుకుంది. అయినా ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో దాని ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరిపి ఆపారు’ అని పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఐఆర్‌జీసీ దళం అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. గల్ఫఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది. ఒకవైపు చర్చలు అంటూ మరోవైపు అమెరికా తన వక్ర బుద్ధిని చూపిస్తోంది. అహంకార, ఆదిపత్య ధోరణిని కనబరుస్తోంది. అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడటం లేదు. దాడులకు ప్రతి దాడులు చేసుకుంటూ, తమ సార్వభౌమాధికారానికి తలొగ్గేది లేదంటూ ధీటుగా బదులిస్తోంది.


