Last Updated:
ఏపీ ప్రభుత్వం కడపలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, 4 నుంచి 9 తరగతుల వరకు, చివరి తేదీ వచ్చే నెల 2, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది
ఆటలంటే ఇష్టం.. మైదానంలో పరుగులు పెడితే ఉత్సాహం.. స్కూల్ స్థాయి పోటీల్లో మెడల్స్ కొట్టేస్తున్నారా..? అయితే అలాంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడల్లో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులను గుర్తించి.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. అంతేకాదు.. మంచి కోచింగ్‌తో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్య కూడా అందిస్తూ.. భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చింది. అయితే ఈ అవకాశాన్ని అందుకోవాలంటే విద్యార్థులకు కేవలం 9 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఎంశాప్ ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శశిధర్ తెలిపారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు చేపడుతున్నారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఇది జీవితాన్ని మార్చే అవకాశంగా మారనుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం చదువే కాదు.. దేశస్థాయి క్రీడాకారులుగా ఎదగడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.
అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి పలు క్రీడల్లో నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు దొరకక వెనుకబడిపోతున్న విద్యార్థులకు ఈ స్పోర్ట్స్ స్కూల్ గొప్ప వేదికగా నిలుస్తోంది. ఒకసారి ఇక్కడ అడ్మిషన్ దక్కితే.. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రమే కాదు.. భవిష్యత్‌లో జాతీయ స్థాయికి వెళ్లే దారులు కూడా తెరుచుకునే అవకాశం ఉంది.
4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలకు రెండు దశల్లో ఎంపికలు నిర్వహిస్తారు. మొదట జిల్లా స్థాయిలో శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి.. అందులో మెరిట్ సాధించిన విద్యార్థులను రాష్ట్రస్థాయి ఫైనల్ ఎంపికలకు పంపిస్తారు. ఇక 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లకు నేరుగా రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించనున్నారు. గతంలో సాధించిన మెడల్స్, క్రీడా సర్టిఫికెట్లు, ట్రయల్స్‌లో చూపించే ప్రతిభ ఆధారంగా సీట్లు ఖరారు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రవేశ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని.. ఎలాంటి సిఫార్సులు, ఒత్తిడులకు అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థుల శారీరక దృఢత్వం, క్రీడా నైపుణ్యం, గత రికార్డుల ఆధారంగానే ఎంపిక జరుగుతుందని తెలిపారు.
ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు వచ్చేనెల 2వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం AP Sports School Official Website ను సందర్శించాలని కోరుతున్నారు. ఇప్పుడు దరఖాస్తు చేస్తే.. రేపు మీ పిల్లలు రాష్ట్రానికి పేరు తెచ్చే క్రీడాకారులుగా మారే అవకాశం ఉందని తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



