Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు నమోదయ్యే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో సముద్ర మట్టానికి దాదాపు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించినట్లు వెల్లడించారు.

ఈ అల్పపీడన కేంద్రం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించిందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, మత్స్యకారులు వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలిపారు. ఆ తర్వాత మూడు రోజులలో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో మాత్రం వచ్చే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తంగా చూస్తే.. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఉక్కపోత.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మిశ్రమంగా మారబోతోందని అధికారులు చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *