Last Updated:
యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు.
Vizag: తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థను తన మేధస్సుతో అబ్బురపరిచి, గ్లోబల్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేశాడు విశాఖపట్నానికి చెందిన కుర్రాడు మానస్ మల్ల. యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు.
యాపిల్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ డెవలపర్ల కోసం ఈ పోటీని నిర్వహిస్తుంది. అయితే, ఈ ఏడాది జరిగిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో మానస్ మల్ల సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది విద్యార్థులు పోటీ పడగా, యాపిల్ ఎంపిక చేసిన టాప్-15 ‘ఎలైట్’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా మానస్ రికార్డు సృష్టించాడు. ఈ విజయం ద్వారా జూన్ 2న అమెరికాలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘యాపిల్ ప్రపంచస్థాయి డెవలపర్స్ సదస్సు’ (WWDC) కు ఆయన అధికారికంగా ఎంపికయ్యారు. ఈ సదస్సులో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను నేరుగా కలిసి, ఆయనతో ముఖాముఖి చర్చించే అరుదైన అవకాశం మానస్‌కు దక్కింది.
మానస్ మల్ల ప్రస్తుతం విశాఖలోని గీతం డీమ్డ్ వర్సిటీలో సీఎస్ఈ (CSE) విద్యార్థి. కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించాలనే తపన అతడిని ఈ స్థాయికి చేర్చింది. బట్టీ పట్టే చదువుల వల్ల విద్యార్థులు పడే మానసిక ఒత్తిడిని గమనించిన మానస్, దానికి పరిష్కారంగా ‘స్మైలీక్వెస్ట్’ (SmileyQuest) అనే ఒక వినూత్నమైన ఆఫ్‌లైన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్‌ను రూపొందించాడు.
ఈ యాప్ తయారీ వెనుక ఒక బాధాకరమైన నేపథ్యం ఉంది. తన స్నేహితుడు ఒకరు పోటీ పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన ఘటన మానస్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆ సమయంలోనే విద్యార్థులకు ఒత్తిడి లేని చదువును అందించాలనే లక్ష్యంతో, తాను చిన్నతనంలో అమెరికాలో చదువుకున్నప్పుడు చూసిన విద్యా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
‘స్మైలీక్వెస్ట్’ యాప్ అత్యాధునిక కృత్రిమ మేధ (AI) మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) సాంకేతికతలతో పనిచేస్తుంది. ఈ యాప్ ప్రత్యేకతలు పరిశీలిస్తే..
ఫేషియల్ ట్రాకింగ్: విద్యార్థి చదువుకుంటున్నప్పుడు వారి ముఖ కదలికలను ఈ యాప్ గమనిస్తుంది.
మానసిక స్థితి గుర్తింపు: విద్యార్థి పాఠం వినేటప్పుడు అయోమయంగా ఉన్నారా లేదా ఆసక్తిగా ఉన్నారా అనేది ఏఐ ద్వారా గుర్తిస్తుంది.
స్నేహపూర్వక బోధన: విద్యార్థి స్థితిని బట్టి, వారి అభిరుచులకు అనుగుణంగా స్థానిక భాషలో చాలా సులభంగా పాఠాలను బోధిస్తుంది.
సమ్మిళిత విద్య: ఈ యాప్ ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అంతేకాకుండా, వినికిడి మరియు దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా దీనిని డిజైన్ చేశాడు.
విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతానికి చెందిన మానస్ సాధించిన ఈ విజయం తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణం. టెక్నాలజీని కేవలం వినోదం కోసం కాకుండా, విద్యార్థుల జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉపయోగించిన మానస్‌ను విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు కొనియాడుతున్నారు. అమెరికా వేదికపై యాపిల్ సీఈవోతో జరిగే భేటీలో మానస్ మల్ల మరిన్ని అద్భుతమైన ఐడియాలతో మన దేశ కీర్తిని చాటాలని ఆశిద్దాం.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



