Last Updated:
విశాఖపట్నం అగనంపూడి శానివాడ సమీపంలో రామేశ్వరి, నర్సింగరావు పెళ్లి తర్వాత కారు ప్రమాదం, రామేశ్వరి అక్కడికక్కడే మృతి, వరుడు సహా ముగ్గురికి గాయాలు
నిన్నటి వరకు పెళ్లి మండపంలో నవ్వులు పూయించిన ఆ నవవధువు… ఈరోజు శవంగా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా ఆరకముందే మృత్యువు ఆమెను కబళించింది. అత్తవారింట్లో కొత్త జీవితానికి అడుగుపెట్టాల్సిన రామేశ్వరి ప్రయాణం..విషాదాంతంగా ముగిసింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి శానివాడ సమీపంలో చోటుచేసుకుంది.
వాడచీపురుపల్లిలో నిన్న రాత్రి ఎంతో ఘనంగా రామేశ్వరి, నర్సింగరావుల వివాహం జరిగింది. బంధుమిత్రుల సందడి, మంగళ వాయిద్యాల మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట.. తెల్లవారుజామున అత్తవారింటికి బయల్దేరింది. పెళ్లి దండలు మెడలోనే ఉండగా, ఆనంద క్షణాలు ఇంకా కళ్లముందే తిరుగుతుండగా, వారు ప్రయాణిస్తున్న కార్ ఒక్కసారిగా అదుపు తప్పింది.
అగనంపూడి శానివాడ సమీపానికి రాగానే కారు వేగంగా వెళ్లి రోడ్డుపక్కనున్న పోల్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత అంతగా ఉండటంతో కారులో ముందుసీట్లో కూర్చున్న నవవధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. కాసేపటి క్రితమే పెళ్లి కూతురిగా మెరిసిపోయిన ఆమె.. పెళ్లి దండలతోనే కారులో ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
వరుడు నర్సింగరావుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఒకవైపు అత్తవారింట్లో కోడలు రాక కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఆమె మృతి వార్త చేరడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పెళ్లి సందడి ఒక్కసారిగా శోకసంద్రంగా మారిపోయింది. కొత్త జీవితంపై ఎన్నో కలలు కట్టుకున్న రామేశ్వరి.. అత్తింటి గడప కూడా దాటకముందే కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



