Last Updated:
Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు.
Tirumala Museum: తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో చేపట్టిన శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆయన అధికారులతో కలిసి మ్యూజియం పనుల పురోగతిని పరిశీలించి, ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.
నిర్మాణ పనులు నిర్దిష్ట గడువులో పూర్తి కావడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ మ్యూజియంలో ఇప్పటికే దాదాపు లక్ష చదరపు అడుగుల మేర ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతూ, భక్తులకు ఆధ్యాత్మికతతో కూడిన విశిష్ట అనుభూతి కలిగేలా రూపకల్పన చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య వైభవం, అలాగే పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి రాజవంశాల శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా గ్యాలరీలను రూపొందిస్తున్నట్లు వివరించారు.
భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు మ్యూజియాన్ని ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా దీర్ఘకాలిక సుస్థిరతతో నిర్వహించే అంశంపైనా చర్చించినట్లు ఆయన చెప్పారు. మ్యూజియంలో ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలతో పాటు క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు కేవలం దర్శనం మాత్రమే కాకుండా, శ్రీవారి ఆలయ చారిత్రక వైభవాన్ని కూడా అనుభవించేలా ఈ మ్యూజియాన్ని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో చీఫ్ మ్యూజియం ఆఫీసర్ (ఎఫ్ఏసీ) శ్రీ సోమన్నారాయణ, ఇతర అధికారులు, టీసీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh
Apr 23, 2026 12:37 PM IST


