Tipper lorry: టిప్పర్ లారీల దూకుడుకు బ్రేక్.. నడిరోడ్డుపై డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..! Andhra Pradesh tipper lorry accidents | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల వేగం, ఓవర్‌లోడ్‌పై ఆందోళన, కాకినాడ-కొవ్వూరు ప్రమాదం తర్వాత రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనిఖీలు, హెచ్చరికలు, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆదేశం

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తున్న ఈ భారీ వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లాలో టిప్పర్ లారీల వ్యవహారంపై జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజానగరం ప్రాంతంలో టిప్పర్ లారీలు ఇష్టారాజ్యంగా రోడ్లపై దూసుకెళ్తున్నాయని స్థానికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మట్టి, రాళ్లు తరలించే వాహనాలు ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండా రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. పైన టార్పాలిన్ కప్పకుండా లోడ్లు తీసుకెళ్లడం వల్ల మట్టి, రాళ్లు రోడ్డుపై పడిపోతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా డ్రైవర్లు మాత్రం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాల భయం రోజురోజుకీ పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. రహదారిపై వెళ్తున్న టిప్పర్ లారీలను అడ్డుకుని డ్రైవర్లను నడిరోడ్డుపైనే ప్రశ్నించారు. ఏమిటి ఈ దూకుడు..? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదు. ఇది నా నియోజకవర్గం.. ఇక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపితే ఊరుకోను అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అక్కడితో ఆగకుండా వాహనాలకు సరైన అనుమతులు ఉన్నాయా..? డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్సులు ఉన్నాయా..? అనే విషయాలపై తనిఖీలు నిర్వహించారు. ట్రాక్టర్లు, టిప్పర్లు ఓవర్‌లోడ్‌తో వెళ్తుండటమే కాకుండా రోడ్లపై మట్టి పడేయడం వల్ల ప్రజలు జారి పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం టిప్పర్ లారీ యజమానులతో ఫోన్‌లో మాట్లాడి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

రాజానగరం నియోజకవర్గంలోని క్రషర్ యజమానులు, టిప్పర్ లారీ ఓనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్, రెవెన్యూ సంబంధిత వాహనాలు హైస్పీడ్‌తో వెళ్లినా, ఓవర్‌లోడ్‌తో నడిపినా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రతి వాహనంపై టార్పాలిన్ తప్పనిసరిగా పూర్తిగా కవర్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వాహనాలను వెంటనే సీజ్ చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఎమ్మెల్యే వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇలాంటి కఠిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *