Last Updated:
Theft Case: గుంటూరు జిల్లాలో గోపి అనే అల్లుడు, వేజెండ్లలో అత్తగారింట్లో తాళాలు పగులగొట్టి 8 సవర్ల బంగారం, వెండి దొంగిలించగా, సీసీటీవీ ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు
సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళ్తే మర్యాదలు జరుగుతాయి. కానీ ఇక్కడో అల్లుడు మాత్రం అత్తగారింటికి కన్నం వేశాడు. భార్య మీద ఉన్న కోపాన్ని, తనకున్న దురలవాట్లను తీర్చుకోవడానికి ఏకంగా దొంగగా మారాడు. గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ వింత దొంగతనం వివరాల్లోకి వెళ్తే..
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరం గ్రామానికి చెందిన గోపికి, వేజెండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మతో దాదాపు పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పది కాలాల పాటు చల్లగా సాగాల్సిన వీరి కాపురంలో గోపి వ్యసనాలు చిచ్చు పెట్టాయి. గోపికి మద్యం తాగడం, పేకాట ఆడటం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. ఈ వ్యసనాల వల్ల సంపాదన అంతా తగలేయడమే కాకుండా, అదనపు డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు.
భర్త వేధింపులు భరించలేక, పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందిన తిరుపతమ్మ, మూడు నెలల క్రితం భర్తను వదిలి పుట్టింటికి వచ్చేసింది. వేజెండ్లలోని తన తల్లి వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే, భార్య దూరమైనా గోపి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా తన జులాయి ఖర్చుల కోసం పుట్టింటికి వెళ్లి మరీ ఆమెను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు.
ఇటీవల గోపి డబ్బుల కోసం భార్యపై ఒత్తిడి పెంచాడు. ఈ గొడవలు పడలేక తిరుపతమ్మ ఎవరికీ చెప్పకుండా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. ఈ నెల 4వ తేదీన భార్యను కలిసేందుకు వేజెండ్ల వెళ్లిన గోపికి, అక్కడ ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించాడు. భార్య తనకి చెప్పకుండా వెళ్లడంపై కోపం, మరోవైపు చేతిలో డబ్బులు లేకపోవడంతో గోపి ఒక దుర్మార్గానికి ఒడిగట్టాడు.
అక్కడ నుంచి తాత్కాలికంగా వెళ్ళిపోయిన గోపి, అర్ధరాత్రి వేళ తిరిగి వచ్చాడు. ఎవరూ లేని సమయం చూసి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాలో ఉన్న ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలను దొంగిలించాడు. తనకేమీ తెలియనట్టు అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన తిరుపతమ్మ, బీరువా తెరిచి ఉండటం, నగలు మాయమవ్వడం చూసి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
“ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు” అనే సామెతను గోపి నమ్మి ఉండొచ్చు కానీ, ఆధునిక సాంకేతికత ముందు అతని పప్పులు ఉడకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు, పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలుస సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. అనుమానం వచ్చి గోపిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది.
తనే స్వయంగా తాళాలు పగులగొట్టి దొంగతనం చేసినట్లు గోపి ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి దొంగిలించిన 8 సవర్ల బంగారం, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గోపిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. మద్యానికి, జూదానికి బానిసలైతే మనుషులు ఎంతటి నీచానికైనా ఒడిగడతారని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



