Suicide: పెళ్లైన 22 రోజులకే భర్త అక్రమ సంబంధం బట్టబయలు.. మనస్తాపంతో నవవధువు బలవన్మరణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

కాకినాడ జిల్లా గోనేడ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, భర్త గాది కోటేశ్వరరావు అక్రమ సంబంధం బాధ తట్టుకోలేక పెళ్లి తర్వాత 22 రోజుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు దర్యాప్తులో ఉంది

News18
News18

ఏప్రిల్ 25న పెళ్లి పీటలెక్కిన ఓ నవవధువు… మే 17 నాటికి ప్రాణాలు కోల్పోవడం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. జీవితాంతం తోడుంటాడనుకున్న భర్త తనను మోసం చేశాడనే బాధను తట్టుకోలేక, ఆ యువతి చివరికి తన చేతులతో తానే తన ప్రాణం తీసుకుంది. పెళ్లై ఇంకా మూడు వారాలు కూడా పూర్తిగా కాకముందే జరిగిన ఈ విషాదం కాకినాడ జిల్లాలో కలకలం రేపుతోంది. కొత్త జీవితంపై ఎన్నో కలలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ యువతి, చివరికి పుట్టింట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని గోనేడ గ్రామానికి చెందిన సత్యంశెట్టి వెంకటలక్ష్మికి, పెద్దాపురం మండలం మర్ల గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో ఏప్రిల్ 25న వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య ఘనంగా జరిగిన ఈ పెళ్లి కేవలం 22 రోజులు మాత్రమే నిలిచింది. ఆదివారం ఉదయం వెంకటలక్ష్మి తన పుట్టింట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం బయటకు రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

అయితే ఈ ఆత్మహత్య వెనుక భర్త అక్రమ సంబంధమే కారణమంటూ గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందనే విషయం పెళ్లి తర్వాత వెంకటలక్ష్మికి తెలిసిందని, ఆ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఇదే విషయంపై ఆందోళన చెందుతూ మానసికంగా కుంగిపోయిందని బంధువులు వాపోతున్నారు.

మృతురాలి బావ పాపారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. వివాహానికి ముందే కోటేశ్వరరావుకు మరో మహిళతో సంబంధం ఉందని తమకు ఇప్పుడు తెలిసిందన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు కూడా ఈ అక్రమ సంబంధంపై గొడవ జరిగిందని, అయితే డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని కాంప్రమైజ్ చేసినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. మా చిట్టితల్లి ఎంతో బాధపడేది… చివరికి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవవధువు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసి, భర్తతో పాటు ఇతర కోణాల్లో కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం. పెళ్లి అనే పవిత్ర బంధంలో నిజాలు దాచిపెడితే ఎలాంటి విషాదాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *