Last Updated:
రాజమండ్రిలో 73 ఏళ్లుగా నడుస్తున్న రోజ్ మిల్క్ సెంటర్ ఫేమస్, పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ దుకాణం చల్లటి రోజ్ మిల్క్, సేమియా కోవా మిక్స్‌తో వేసవిలో టూరిస్టులను ఆకర్షిస్తోంది
ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లగా, టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తే చాలామంది గుర్తు చేసుకునేది రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్‌నే. గోదావరి నగరానికి వెళ్లిన వారు ఒక్కసారి అయినా ఈ రోజ్ మిల్క్ రుచి చూడకుండా తిరిగి రావడం చాలా అరుదు అంటారు స్థానికులు. ఎందుకంటే ఇది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు.. దాదాపు 73 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేకమైన రుచి జ్ఞాపకం.
Rajahmundryలోని పుష్కర్ ఘాట్ ఎదురుగా ఉన్న మార్కెట్ వీధి, నీలిమందు జంక్షన్ దగ్గర కనిపించే ఈ ఒరిజినల్ రోజ్ మిల్క్ సెంటర్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూనే ఉంటుంది. నగరంలో చాలాచోట్ల రోజ్ మిల్క్ పాయింట్లు కనిపించినా.. 73 ఏళ్ల రోజ్ మిల్క్ అంటూ కనిపించే బోర్డు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ వీధిలో అడుగుపెట్టగానే గులాబీ సువాసన ముక్కును తాకి నోరూరించేలా చేస్తుందని అక్కడికి వెళ్లినవాళ్లు చెబుతుంటారు.
ఈ రోజ్ మిల్క్ ప్రత్యేకత దాని తయారీలోనే దాగి ఉంది. గులాబీ పువ్వులను ఎండబెట్టి, వాటిలో తీపి రసాలు, పంచదార కలిపి ప్రత్యేకంగా తయారు చేసే రోజ్ వాటర్ వల్లే ఈ టేస్ట్ వస్తుందట. కస్టమర్ల ముందే చల్లటి పాలు, ఐస్, రోజ్ వాటర్ కలిపి గ్లాసులో అందిస్తారు. సేమియా మిక్స్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకో లెవల్‌లో ఉంటుందని చెప్పుకుంటారు. ఒక్క గ్లాస్ తాగితే వేసవి వేడి మొత్తం మాయమైపోయినట్టు అనిపిస్తుందని చాలామంది ఫుడ్ లవర్స్ చెబుతున్నారు.
ఇక్కడ రోజ్ మిల్క్ మాత్రమే కాదు.. సేమియా కోవా మిక్స్ కూడా మంచి డిమాండ్‌లో ఉంది. ప్రస్తుతం సాధారణ రోజ్ మిల్క్ ధర రూ.60 కాగా, సేమియా మిక్స్ రూ.70కు విక్రయిస్తున్నారు. ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేక రోజ్ వాటర్ బాటిళ్లను కూడా అమ్ముతున్నారు. ఒక్కో బాటిల్ ధర రూ.130. ఆ బాటిల్‌ను ఫ్రిడ్జ్‌లో దాదాపు ఆరు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇంట్లో రోజ్ మిల్క్ తయారు చేయడం కూడా చాలా సింపుల్ అంటున్నారు. గ్లాసులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి, చల్లటి పాలు కలిపి, సబ్జా లేదా ఉడికించిన సేమియా వేసుకుంటే రాజమండ్రి స్టైల్ రోజ్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఇదే కారణంగా చాలామంది టూరిస్టులు తిరిగి వెళ్లేటప్పుడు ఈ బాటిళ్లను తప్పకుండా తీసుకెళ్తున్నారు.
ముఖ్యంగా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. 73 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ రోజ్ మిల్క్ సెంటర్‌ను ఇప్పుడు మూడో తరం వారసులు నిర్వహిస్తున్నారు. కాలం మారినా.. రుచి మాత్రం మారలేదని అక్కడికి వెళ్లినవాళ్లు చెబుతుంటారు. అందుకే రాజమండ్రి అంటే గోదావరి, పుష్కర ఘాట్ తర్వాత వెంటనే గుర్తొచ్చేది ఈ ఫేమస్ రోజ్ మిల్క్‌నే అంటున్నారు ఫుడ్ లవర్స్.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


