Profitable Business: ఇది కదా వ్యాపారం అంటే.. రూ.12 కౌజు పిట్టలు కొని రూ.70 కు అమ్మకం.. నెలకే లక్షల్లో లాభం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Profitable Business: అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన జగదీష్, చదువు ఆగినా కౌజు పిట్టల పెంపకంతో నెలకు 10 వేల పిట్టలు పెంచి, రూ.70 వేల నుంచి 1.50 లక్షల వరకు లాభం ఆర్జిస్తున్నాడు

+

News18

News18

అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణానికి చెందిన జగదీష్ అనే యువకుడు, జీవితంలో ఎదురైన కష్టాలను అవకాశాలుగా మలుచుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఉన్నత విద్యను కొనసాగించలేకపోయాడు. అయితే నిరాశ చెందకుండా, కుటుంబానికి అండగా నిలబడాలని సంకల్పించిన ఈ యువకుడు ఉద్యోగాల కోసం తిరగకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశాడు. స్నేహితుల సూచనలతో కౌజు పిట్టల పెంపకం రంగంపై ఆసక్తి పెంచుకున్న జగదీష్, దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన సంపాదించి ఇప్పుడు మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు.

కౌజు పిట్టల పెంపకం గురించి మొదట్లో చాలా మందికి అవగాహన లేకపోయినా, మార్కెట్లో వీటికి ఉన్న డిమాండ్‌ను గుర్తించిన జగదీష్ ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. కౌజు పిట్టలను ఎలా పెంచాలి, వాటికి ఏ ఆహారం ఇవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. అనంతరం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పరిధిలోని వీకోట జాతీయ రహదారి సమీపంలో ఉన్న కృష్ణాపురం సచివాలయం ఎదురుగా మద్దిరాల గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి కోళ్ల ఫారంను లీజుకు తీసుకుని తన వ్యాపారాన్ని ప్రారంభించాడు.

తమిళనాడులోని వేలూరు నగరం నుంచి కౌజు పిట్ట పిల్లలను తెప్పించి పెంచడం ప్రారంభించాడు. ఒక్క పిల్ల ధర సుమారు రూ.12 వరకు ఉంటుందని, వాటిని 30 రోజులపాటు పెంచితే మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవచ్చని జగదీష్ చెబుతున్నాడు. ప్రస్తుతం హోటళ్లు, డాబాలు, ఫంక్షన్లు, క్యాటరింగ్ వ్యాపారులు కౌజు పిట్టల కోసం ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారని తెలిపాడు. కౌజు పిట్ట మాంసానికి ప్రత్యేక రుచి ఉండటంతో పాటు ఆరోగ్యకరమని భావించే వారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని వెల్లడించాడు.

కౌజు పిట్టల పెంపకంలో ఖర్చు తక్కువగా ఉండటం ఈ వ్యాపారానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఒక పిట్ట 30 రోజుల వ్యవధిలో సుమారు అర కిలో ఫీడ్ మాత్రమే తీసుకుంటుందని, దీంతో ఆహార ఖర్చు కూడా నియంత్రణలో ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం నెలకు సుమారు 10 వేల పిట్టలను పెంచుతున్న జగదీష్, అన్ని ఖర్చులు పోయిన తర్వాత కూడా రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు లాభం వస్తోందని ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో కార్మికులు అవసరం లేకపోవడం మరో ప్రత్యేకత. ఒక వ్యక్తి ఒక్కడే వేల సంఖ్యలో పిట్టలను చూసుకోవచ్చని జగదీష్ చెబుతున్నాడు. కోళ్ల ఫారం లేకపోయినా తక్కువ బడ్జెట్‌తో చిన్న షెడ్ నిర్మించుకుని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చని సూచించాడు. సుమారు 600 అడుగుల స్థలంలోనే చిన్న స్థాయి కౌజు పిట్టల యూనిట్ ఏర్పాటు చేయవచ్చని తెలిపాడు.

కౌజు పిట్టల మార్కెట్ రోజురోజుకీ పెరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ రంగానికి మరింత ఆదరణ పెరుగుతుందని జగదీష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చదువు మధ్యలో ఆగిపోయినా, నిరుత్సాహపడకుండా కొత్త దారిని ఎంచుకుని విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదుగుతున్న ఈ యువకుడు ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గ్రామీణ యువత ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లకుండా ఇలాంటి స్వయం ఉపాధి రంగాల్లోకి వస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చని ఆయన సూచిస్తున్నాడు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *