ఉత్తరాంధ్ర ఆశయాలు, పోరాటాలు, కలలకు న్యాయం జరిగిందని, ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది నాయకులు చేసిన పోరాట పటిమకు పట్టం కట్టినట్లుగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ నెరవేరడం వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతర కృషి, దూరదృష్టి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఉన్న హామీని కార్యరూపం దాల్చించే దిశగా చంద్రబాబు గారు నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రధాన అజెండాగా నిలిపారని తెలిపారు.
2014-19 కాలంలో టీడీపీ ఎంపీలు పార్లమెంటు లోపల, బయట “విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు” అంటూ గళమెత్తిన పోరాట ఫలితమే ఈ రోజు కనిపిస్తుందని అన్నారు. 2019లో జోన్ ప్రకటించినప్పటికీ, తరువాతి కాలంలో పనులు మందగించడం, ముఖ్యంగా 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రాజెక్టు నిలిచిపోవడం బాధాకరమని విమర్శించారు. భూసేకరణ వంటి కీలక అంశాల్లో ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ముందుకు సాగలేదని పేర్కొన్నారు.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖతో చర్చలు జరిపి ప్రక్రియను వేగవంతం చేశారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, పరిపాలనా పరమైన అడ్డంకులను తొలగించి రైల్వే జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారని చెప్పారు.
చంద్రబాబు విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించి, పరిపాలన అనుమతులను వేగవంతం చేయడంతో 2026 మే 4న గెజిట్ విడుదల కావడం సాధ్యమైందని పల్లా పేర్కొన్నారు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించబోతుందని తెలిపారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు స్వంత రైల్వే జోన్ లభించిందని చెప్పారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వాన్ని పల్లా ప్రశంసిస్తూ… ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమగ్ర దిశలో ముందుకు తీసుకెళ్తూ, స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనం నుంచి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ పెట్టుబడుల వరకు తీసుకువచ్చి విశాఖను ప్రపంచ పటంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు గారేనని కొనియాడారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయం సాధ్యంకావడంలో ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో పాటు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సిఎం రమేష్ తదితరుల సమిష్టి కృషి కూడా ఎంతో కీలకమైందని పల్లా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని, కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నం దేశంలోనే కీలక రైల్వే హబ్‌గా ఎదిగే దిశగా ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


