250కుటుంబాలకు మేలు చేకూర్చేలా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు
విశాలాంధ్ర ధర్మవరం;;ముదిగుబ్బ మండల కేంద్రంలో 250కుటుంబాలకు గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ చొరవతో పరిష్కారం లభించింది. గుంజేపల్లి పొలంలోని సర్వే నెంబర్ 905-ఏలోని 3ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్వో కొండయ్య, ధర్మవరం ఆర్డిఓ సువర్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిషేధిత జాబితాలో ఉన్న స్థలానికి విముక్తి కల్పిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగుబ్బ మండల కేంద్రంలో సుమారు 250మంది 3.28 ఎకరాల స్థలంలో గత కొన్నేళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే 22-ఏ జాబితాలో ఉండటంతో ఎలాంటి క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో 250మంది బాధితులు, పరిటాల శ్రీరామ్ సహకారంతో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆ 3.28 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై బాధితులు, పరిటాల శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఒక నెల- ఒక నియోజకవర్గం- నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి అర్జీలు పెండింగ్‌లో లేకుండా చూడడం, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడం, ప్రజల ఫిర్యాదుల పరిష్కార సేవలను వారి ఇంటి వద్దకే చేర్చడం వంటి వాటిని ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజలు పలు సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వీటి పరిష్కారం కోసం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా త్వరితగతిన పరిష్కారం లభించడం లేదన్నారు. అందుకే ప్రభుత్వం తాజాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో సమస్యపై ప్రజలు పదేపదే అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం, కోర్టు వివాదాలను తగ్గించడం, ప్రభుత్వ పరిపాలనపై పౌరుల్లో నమ్మకాన్ని పెంచే విధంగా చేస్తోందన్నారు.అదేవిదంగా ముదిగుబ్బ ప్రజలు నీటి సమస్యను పరిటాల శ్రీరామ్ గారి దృష్టికి తీసుకుపోగా అక్కడే వున్న ముదిగుబ్బ ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కు ముదిగుబ్బలోని నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించదుమైనది. మొత్తం మీద మాకు న్యాయం జరిగిందని కుటుంబాలు హర్షం వ్యక్తం చేశారు.


