NEET పరీక్షలపై అలర్ట్.. చిత్తూరులో కట్టుదిట్టమైన భద్రత, విద్యార్థులకు కీలక సూచనలు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు లో NEET పరీక్షల కోసం సావిత్రమ్మ కాలేజీ, PVKN, లిటిల్ ఫ్లవర్ కాలేజీ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరా పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేశారు

News18
News18

చిత్తూరు నగరంలో జరగనున్న NEET పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అధికారులు పగడ్బందీ ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నారు. ఆదివారం పరీక్షలు జరగనున్నాయి ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ, విద్యాశాఖ కలిసి సమగ్ర చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు సబ్-డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శనివారం ఆయన 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్యరితో కలిసి నగరంలోని ముఖ్య పరీక్ష కేంద్రాలను పర్యటించారు. ఈ సందర్భంగా సంబంధిత కేంద్రాల ప్రిన్సిపాల్ మరియు సిటీ కోఆర్డినేటర్ జీవన జ్యోతితో మాట్లాడి, పరీక్షల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, భద్రతా చర్యలు, సిబ్బంది నియామకం, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడిన డీఎస్పీ వెంకటనారాయణ, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు చిత్తూరులోని సావిత్రమ్మ కాలేజీ, PVKN, లిటిల్ ఫ్లవర్ కాలేజీ వంటి మూడు ప్రధాన పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద తగినంత పోలీసు బలగాలను మోహరించి, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడతాయని, ఎలాంటి మోసపూరిత చర్యలకు తావులేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విద్యార్థులకు డీఎస్పీ కీలక సూచనలు కూడా చేశారు. పరీక్షకు హాజరయ్యే వారు కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని, చివరి నిమిషం రద్దీని నివారించుకోవాలని సూచించారు. హాల్ టికెట్ మరియు చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు వంటి నిషేధిత వస్తువులను తీసుకురావద్దని హెచ్చరించారు. పరీక్షా సిబ్బంది సూచనలను కచ్చితంగా పాటించాలని, ఎటువంటి అనుమానాస్పద చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. అలాగే తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్ద గుంపులుగా గుమికూడకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సిటీ కోఆర్డినేటర్ జీవన జ్యోతి మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, సౌకర్యవంతమైన వసతులు, సిబ్బంది నియామకం వంటి అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యలతో చిత్తూరులో NEET పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *