జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రవి వర్గానికి చెందిన నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ప్రత్యేకంగా శుభఫలితాలు ఇస్తారని శ్రీనివాస్ శర్మ గారు చెబుతున్నారు. ముఖ్యంగా కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాడ నక్షత్రాల్లో జన్మించిన వారు సహజంగా నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, తేజస్సుతో కనిపిస్తారు. వీరి వ్యక్తిత్వం కుటుంబంపై బలమైన ప్రభావం చూపడంతో తండ్రి జీవితంలో ఎదుగుదల, గౌరవం పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఉత్తర ఫల్గుణి 1వ పాదంలో పుట్టిన అమ్మాయిలు తండ్రికి మరింత శుభఫలితాలు అందిస్తారని పండితులు విశేషంగా చెబుతున్నారు.రవి గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో తండ్రిని సూచించే ప్రధాన గ్రహంగా పరిగణించబడుతుంది. అందుకే రవి వర్గ నక్షత్రాల్లో పుట్టిన కూతుళ్లు తండ్రికి అదృష్టాన్ని తీసుకొస్తారని విశ్వాసం బలంగా ఉంది. రవి ప్రభావం వల్ల వీరిలో ధైర్యం, నిర్ణయ సామర్థ్యం, నాయకత్వ గుణాలు ఎక్కువగా కనిపిస్తాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని కుటుంబానికి అండగా నిలబడే శక్తి వీరిలో సహజంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.



