Heat Wave: ఏపీలో భానుడి విశ్వరూపం.. గోదావరి జిల్లాల్లో బయట అడుగుపెట్టలేని పరిస్థితి..! Andhra Pradesh heat wave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఏపీలో నిప్పుల కుంపటి.. రోడ్డుపై వెళితే మండిపోతున్న దేహాలు

+

News18

News18

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ మరింత భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో భానుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణ శాఖ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, నేలమీద పరిస్థితులు అంతకుమించి ఉన్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎండ నేరుగా కనిపించకపోయినా, విపరీతమైన ఉక్కపోత, దేహం మండిపోయేలా వేడి గాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలైన తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఏలూరు ప్రాంతాలతో పాటు విజయవాడ, పోలవరం జిల్లా పరిసరాలు, రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా వేడి గాలులు మరింత పెరిగాయి. ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోతుండగా, అత్యవసర పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఈసారి ఎండల తీరు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. మండే సూర్యకిరణాల కంటే కనిపించని ఉక్కపోతే ఎక్కువగా ఇబ్బంది పెడుతోందని వాపోతున్నారు. చెట్ల కింద నిలబడినా ఉపశమనం లేకపోవడం, అక్కడ కూడా వేడి గాలులు వీచడం ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏసీలు ఉన్నవారు కొంత ఉపశమనం పొందుతున్నా, ఫ్యాన్లు, కూలర్లు మాత్రం ఈ వేడిని తగ్గించలేకపోతున్నాయని ప్రజలు అంటున్నారు.

రోడ్లపై చల్లని పానీయాల దుకాణాలు, కొబ్బరి బొండాల వద్ద జనసందోహం కనిపిస్తోంది. అయితే వైద్య నిపుణులు మాత్రం కూల్ డ్రింక్స్ కంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. కాకినాడ జిల్లా కలెక్టర్ ప్రసాద్ ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని సూచించారు. డీహైడ్రేషన్‌ నుంచి రక్షించుకునేందుకు మజ్జిగ, కొబ్బరి బొండాలు, సహజ పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

భానుడి భగ్గుమనే వేడి, ఉక్కపోత, వేడి గాలులతో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ జీవనం దాదాపు అస్తవ్యస్తంగా మారిపోయింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *