ఆంధ్రప్రదేశ్‌ను దేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో పెద్ద అడుగు పడింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు రక్షణ రంగానికి సంబంధించిన పలు అనుబంధ ప్రాజెక్టుల శిలాఫలకాలను కూడా వర్చువల్‌గా ఆవిష్కరించారు.
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు, భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. ఆధునిక సాంకేతికతతో స్టెల్త్ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేసి పరీక్షించే కేంద్రంగా పుట్టపర్తి ఎదగనుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుట్టపర్తి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇకపై రక్షణ రంగంలోనూ దేశానికి వ్యూహాత్మక కేంద్రంగా మారబోతోందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు కీలకమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో రూపొందనున్న ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్, ఆధునిక రక్షణ పరికరాల అభివృద్ధికి ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
రక్షణ రంగంతో పాటు డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యంపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర మరింత పెరిగిందని, ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌లో వినియోగించిన కొన్ని డ్రోన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే తయారై పరీక్షించబడినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి ఉత్పత్తి, పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు చెప్పారు.
రాయలసీమను పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక ప్రణాళికలు అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో గోల్డ్ అంటే KGF, ఇప్పుడు గోల్డ్ అంటే JGF… జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ కర్నూలులో వస్తోంది. JGFలో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. రెండో ఏడాది 1500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకమవుతుంది. కడప స్టీల్ ప్లాంట్, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, స్పేస్ సిటీ వంటి ప్రాజెక్టులు రాయలసీమ రూపురేఖలను మార్చనున్నాయని పేర్కొన్నారు.
శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధనలు, నాగాయలంకలో క్షిపణి అభివృద్ధి, విశాఖలో నౌకాదళ కార్యకలాపాలు, ఇప్పుడు పుట్టపర్తిలో రక్షణ పరిశోధనలతో ఆంధ్రప్రదేశ్ దేశ భద్రతకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని సీఎం వ్యాఖ్యానించారు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఇంధన సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని ఆయన చెప్పారు. విదేశీ మారక నిల్వల పరిరక్షణ, పొదుపు చర్యలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం వంటి అంశాలపై ప్రతి భారతీయుడు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధిని “బుల్లెట్ స్పీడ్”తో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పిన చంద్రబాబు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. “ఏపీలో డిజైన్ చేయండి, ఇక్కడే పెట్టుబడులు పెట్టండి, ఇక్కడే తయారీ చేయండి” అంటూ పరిశ్రమలకు ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు, రక్షణ రంగ ప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన క్షిపణులు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమాన నమూనాలు, రక్షణ పరికరాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


