ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించి గంగాధరనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోనే 40 అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీవో పద్మ సునంద తెలిపారు. గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కలిజవేడు, అరవచేనుపల్లె, మేనాటంపల్లె, గోవిందరెడ్డిపల్లె, సర్విరెడ్డిపల్లె, ఆరిమాకులపల్లె, పద్మాపురం, ఒడ్డుపల్లె, బోడపూరు, తూగుండ్రం, కోటాగరం, తిరువీధికుప్పం తదితర గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అలాగే పెనుమూరు మండలంలోని తలారిపల్లె, విడిదిపల్లె, సామిరెడ్డిపల్లె ఎస్టీ కాలనీ, దాసరపల్లె, పాల్యం గిరిజన కాలనీ వంటి ప్రాంతాల్లో అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. పాలసముద్రం మండలంలోని బాలకృష్ణాపురం, గుట్టమీద ఇండ్లు, వెంగల్రాజుకుప్పం, అలిమేలుమంగాపురం గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బంగారుపాళ్యం, యాదమరి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో వినతశ్రీ తెలిపారు. బంగారుపాళ్యం మండలంలోని మడుపోలూరు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త పోస్టుతో పాటు బేరిపల్లి, వజ్రాలపురం, గడ్డవారిపల్లె, చంద్రశేఖరపురం గ్రామాల్లో హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. యాదమరి మండలంలో కె.కొత్తూరు, పట్రపల్లె, పాచిగుంట, మంగదానపల్లె, గాంధీపురం గ్రామాల్లో అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇక నగరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో విజయపురం, నిండ్ర, నగరి మండలాల్లోని పలు గ్రామాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీవో ఇందిర ప్రియదర్శిని తెలిపారు. సామిరెడ్డికండ్రిగ, కేవీ శ్రీరామాపురం, అత్తూరు గిరిజన కాలనీ, నెట్టేరి క్రాస్ రోడ్డు, కన్యకాపురం గ్రామాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
అదేవిధంగా కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో వర్కర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉండగా, అందులో ఒకటి అంగన్వాడీ టీచర్ పోస్టు, మూడు సహాయకురాళ్ల పోస్టులు ఉన్నాయి. గడ్డూరు గ్రామంలో టీచర్ పోస్టు ఓపెన్ కేటగిరీలో ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీకోట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. దేయాలపల్లి, పసలమంద, వీజీతోపు, యడగురికి, నాయకనేరి, దేవరాజుపురం గ్రామాల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక గ్రామానికి చెందిన వివాహిత మహిళలు అయి ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని అధికారులు పేర్కొన్నారు. వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఆసక్తి గల మహిళలు ఈనెల 26 లేదా 28వ తేదీలలోపు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాల కోసం సమీప సీడీపీవో కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.


