సిట్ అదుపులో సీఐ నాగరాజు – Visalaandhra


కస్టడీ మృతిపై దర్యాప్తు ముమ్మరం

విశాలాంధ్ర ` విజయవాడ (క్రైమ్):గాదే సాయికృష్ణ కస్టడీ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సస్పెండ్ అయిన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఎస్ఎస్వీ నాగరాజును మంగళవారం అదుపులోకి తీసుకుంది. ఆయన అజిత్ సింగ్ నగర్‌లోని ఒక నివాసంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న సిట్ అధికారులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారి, టాస్క్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ తన బృందంతో కలిసి నాగరాజును అదుపులోకి తీసుకుని ఏఆర్ గ్రౌండ్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేశారు.
పోలీసు అధికారుల ప్రకారం ఈ కేసులో కస్టడీలో చిత్రహింసలు, మరణం, సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై సిట్ జరుపుతున్న దర్యాప్తులో భాగంగా నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు తలదాచుకున్న ఇంటి సమీపంలోకి పెద్ద సంఖ్యలో స్థానికులు, మద్దతుదారులు రావడంతో అజిత్ సింగ్ నగర్‌లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నాగరాజుకు నిరసనకారులు మద్దతుగా నినాదాలు చేస్తూ, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసు సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ నాగరాజును ఆ ప్రాంతం నుంచి తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. విచారణ అనంతరం సిట్ అతడిని కోర్టులో హాజరుపరిచి… తదుపరి విచారణ కోసం కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *