ఇద్దరు కార్మికుల సజీవదహనం
ఏడుగురికి తీవ్ర గాయాలు
విశాలాంధ్ర బ్యూరోఅనకాపల్లి (పరవాడ)/అమరావతి : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్3 లో హై కెలోరిఫిక్ వ్యాల్యూ ఫ్యూయల్ ఉత్పత్తి చేస్తున్న దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అచ్యుతాపురం, గోవాడ ప్రాంతాలకు చెందిన ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఏడుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని తీవ్ర గాయాలపాలయ్యారు. పరవాడ ఇండస్ట్రియల్ పార్క్లో షా వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన దక్షిణ్ ప్లాస్టిక్ ఆయిల్ పరిశ్రమలో ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్, కారÒన్ బ్లాకులు ఉత్పత్తి చేస్తున్నారు. ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న షిఫ్ట్ కార్మికులు వేపాడ వెంకటేష్ (34), త్రినాథ్ (25) మృతి చెందారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన అగ్నిమాపక శకటాలు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన వారిని వైద్య చికిత్స కోసం విశాఖ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. సంఘటన సమాచారం తెలుసుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్‌ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్‌గా చెబుతున్నారు. మంత్రి సుభాష్, పల్లా శ్రీనివాసరావు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
పరవాడ ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీ సంస్థలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల సీఎం సంతాపం తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులతో మాట్లాడి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై నివేదిక కోరారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు, పరవాడ నుంచి మరో అగ్నిమాపక వాహనం ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు సీఎంకు వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని అధికారులకు సూచించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.
పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి : పవన్ కల్యాణ్
పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను అదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


