నేడు కాంగ్రెస్ అత్యవసర సమావేశం – Visalaandhra


న్యూదిల్లీ: దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ గురువారం దిల్లీలోని ఇందిరాభవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. జూన్ 8న ఇండియా ఐక్యసంఘటన సమావేశం జరిగిన కొన్నిరోజులకే కాంగ్రెస్ ఈ అంతర్గత భేటీని నిర్వహంచనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపక్షాలు ఐక్యంగా ఎదుర్కొని వీగిపోయేలా చేశాయి. ఆ విజయాన్ని గత సమావేశంలో ఖడ్గే అభినందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బలు తగిలాయి. వాటి నుంచి కోలుకుని, మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రణాళికను ఖడ్గే రేపటి సమావేశంలో రాష్ట్రాల నేతలకు వివరించనున్నట్లు సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *