డా॥ జ్ఞాన్ పాఠక్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికులు, రైతులు తమ ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 జూలై 29న న్యూదిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ కార్మిక-రైతు మహాసభలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మే 30న ఈ మహాసభను ప్రకటించాయి. అనంతరం దేశవ్యాప్తంగా ఏర్పాట్లను ప్రారంభించాయి. ఈ మహాసభలో భవిష్యత్ ఉమ్మడి పోరాటాల దశదిశను ప్రకటించడంతో పాటు, అన్ని డిమాండ్లు నెరవేరే వరకు స్వతంత్ర, సమస్యాధారిత, ఐక్య ఉద్యమాలను మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమన్వయ ఉద్యమ నిర్మాణంలో ఇది కీలక అడుగు అని భావిస్తున్నారు. కార్మికులు, రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.అవసరమైతే దేశ వ్యాప్తంగా సాధారణ సమ్మెలను కూడా నిర్వహించాలన్న ఆలోచనలో సీటీయూలు, ఎస్‌కేఎం ఉన్నాయి. ఫిబ్రవరి 12న నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను దేశ చరిత్రలో అతిపెద్ద కార్మిక సమ్మెలలో ఒకటి. ఈసారి బహుదినాల సమ్మెపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగు కార్మిక కోడ్‌లను ఉపసంహరించుకోవాలన్నదే వారి ప్రధాన డిమాండ్. మే 4న రాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్‌ల అమలుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. అలాగే మే 11న “వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)”ను ప్రకటించింది. ఇది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (మన్‌రేగా) స్థానాన్ని భర్తీ చేయనుంది. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారత రైతులను ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు లోబడి ఉండేలా చేస్తాయని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) విమర్శిస్తోంది. రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం సి2ం50 శాతం ఆధారంగా ఎంఎస్‌పీ నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. జనవరి 2026లో జరిగిన జాతీయ కార్మిక మహాసభ ఫిబ్రవరి 12 సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మే 8-9 తేదీల్లో నాలుగు కార్మిక కోడ్‌ల తుది నిబంధనలు, మే 11న వీబీజీ రామ్-జీ పథకం నోటిఫికేషన్ వెలువడ్డాక జరగనున్న తొలి జాతీయ మహాసభ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో మే 13 న దిల్లీలో జరిగిన సీటీయూలు-ఎస్‌కేఎం సంయుక్త సమావేశంలో జాతీయ మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. మే 30న ప్రకటించడం ద్వారా మోదీ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు నాంది పలికారు. వారి ప్రధాన డిమాండ్లలో సి2ం50 శాతం ఆధారంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ, చట్టబద్దత కలిగిన కనీస వేతనం, ఉపాధి హక్కు, వ్యవసాయ రుణ మాఫీ, నాలుగు కార్మిక కోడ్‌ల ఉపసంహరణ ఉన్నాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ, ప్రతిపాదిత విత్తన బిల్లు, భూసేకరణ-పునరావాస చట్టం 2013 అమలు, వ్యవసాయం, పరిశ్రమలకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం భారీ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కార్మికులు, రైతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తోందని సంయుక్త వేదిక ఆరోపించింది. కేంద్ర ఆర్థిక విధానాలు సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య సంస్థలు, లౌకిక విలువలు, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని బలహీనపరిచాయి. ఫిబ్రవరి 12 సమ్మె సందర్భంగా లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదని, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు విమర్శించాయి.ఎరువుల కొరత వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రతపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇంధన ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నాయి కార్మిక సంఘాలు. ధనిక వర్గాలపై పన్నులు పెంచకుండా ప్రభుత్వం ఇంధన పొదుపు, బంగారు కొనుగోళ్లు తగ్గించాలని చెప్తూ మితవ్యయ విధానాలు అమలు చేస్తోందని ఆరోపించాయి. ఇరాన్ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. దేశ రాజధాని ప్రాంతంలో ఇటీవల కార్మికులు చేపట్టిన ఆందోళనలకు సీటీయూలు, ఎస్‌కేఎం మద్దతు ప్రకటించాయి. కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సామాజిక కార్యకర్తలపై పెరుగుతున్న పోలీసు చర్యల నేపథ్యంలో నిరసన హక్కుపై ఆంక్షల అంశాన్ని జాతీయ మహాసభలో చర్చించనున్నారు. కార్మిక నాయకులు, సామాజిక కార్యకర్తలపై నమోదైన “తప్పుడు కేసులను” ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విభేదాలను నేరంగా పరిగణించే ధోరణి పెరుగుతోందని కూడా ఆరోపించారు.
The post కార్మికులు-రైతుల ఉమ్మడి పోరు appeared first on Visalaandhra.


