అజిజ్ పాషా
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలలో వాతావరణ మార్పు కీలకమైనది. వాతావరణ పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు . భారతదేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో తీవ్ర వడగాలులు, వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసకర వరదలు తరచు సంభవిస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవనోపాధిని, వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు : అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌తో పాటు ఇతర హిమానీనదాలు వేగంగా కరుగుతుండటం వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలలో ఒకటి. అడవుల నరికివేత, కార్చిచ్చులు , సముద్రాలూ వేడెక్కడం వంటి వాటి వల్ల తీరప్రాంత నగరాలు, భారీ తుఫానులు, వరదలు, ముంపు సమస్యలకు గురవుతున్నాయి. భారతదేశం ప్రస్తుతం కీలకమైన దశలో ఉంది. దేశంలోని 77 శాతం జిల్లాలు అత్యధిక ఉష్ణోగ్రతలతో ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నాయి . ఈ పరిస్థితుల వలన 2025లో దాదాపు 54 లక్షల మంది కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి వలస వెళ్లాల్సి వచ్చింది. గత 39 ఏళ్లలో వాతావరణ ప్రభావానికి గురైన దేశాలలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారతదేశ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేసే మరో ముఖ్య అంశం ఎల్-నినో. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడాన్నీ ‘ఎల్‌నినో’ అని పిలుస్తారు. దీని కారణంగా గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో వాతావరణ పరిస్థితి దారుణంగా మారిపోవడమే కాదు రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపడంతో వర్షపాతం తగ్గిపోయి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే వేసవిలో వడగాలుల తీవ్రతను బాగా పెంచేసింది. అడవుల నరికివేత పర్యావరణ విధ్వంసానికి మరో ప్రధాన కారణం. అడవులు నాశనమైనప్పుడల్లా గిరిజన సమాజాలే అత్యధికంగా నష్టపోతాయి. జీవనోపాధి కోల్పోయిన వారు పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 2006లో అమలులోకి వచ్చిన అటవీ హక్కుల చట్టం నిర్వాసితులకు కొన్ని హక్కులు, రక్షణలు కల్పించినప్పటికీ, ఆచరణలో గిరిజనులను వారి స్వంత భూముల్లోనే ఆక్రమణదారులుగా ముద్ర వేస్తున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే గిరిజనులు దాదాపు ఏడు రెట్లు అధికంగా వాతావరణ కారణాల వల్ల నిర్వాసితులవుతున్నారు. అందువల్ల అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ అభివృద్ధి ప్రాజెక్టు అయినా, పరిశ్రమ అయినా స్థానిక గ్రామసభ ఆమోదం పొందాకే అమలు కావాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనను పాటించడం లేదు.
కార్పొరేట్ ప్రాజెక్టులు, భూముల బదలాయింపు : ప్రభుత్వాలు స్థానిక ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి పెద్ద కార్పొరేట్ సంస్థలకు భూములను కేటాయిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సర్గుజా ప్రాంతంలో 1,742.6 హెక్టార్ల అటవీ భూమిని అదానీ గ్రూప్‌కు బదలాయించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, మహారాష్ట్ర రాష్ట్రాలలో వరుసగా 7,000, 1,040, 116, 87.35 హెక్టార్ల భూములను అదానీ సంస్థకు కేటాయించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఈ భూముల కేటాయింపులు స్థానిక గ్రామసభల తప్పనిసరి అనుమతిని పక్కనబెట్టి జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది అటవీ హక్కుల చట్టం స్ఫూర్తికి విరుద్ధం. ఫలితంగా పెద్దఎత్తున ప్రజలు నిర్వాసితులవుతున్నారు , వన్యప్రాణుల సంచార మార్గాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతోంది.
ప్రభుత్వ చర్యలు -అమలులో లోపాలు : 2015-16 కాలంలో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. అయితే వాటి అమలు నత్తనడకన సాగుతున్నాయి , చాలా ప్రాంతాల్లో లక్ష్యిత వర్గాలకు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, పౌరుల బాధ్యత కూడా అంతే కీలకం . ప్రతి పౌరుడు కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షపు నీటిని సంరక్షించుకోవాలి. తాగునీటి పైపులలో లీకేజీలను సరిచేయాలి. స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను నాటాలి. పట్టణాలను మరింత పచ్చగా ఉండేలా చూసుకోవాలి.
భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే ముందు నిర్దిష్ట సంఖ్యలో మొక్కలు నాటడాన్ని మున్సిపాలిటీలు తప్పనిసరి చేయాలి. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే నిర్మాణ అనుమతుల కోసం మొక్కల పెంపకాన్ని ఒక ముందస్తు షరతుగా అమలు చేస్తోంది. ఇటువంటి చర్యలను దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది.
వాతావరణ మార్పులు కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. ఇది ఆర్థిక, సామాజిక, మానవతా సంక్షోభంగా మారుతోంది. ప్రభుత్వాలు సమర్థవంతమైన విధానాలను అమలు చేయడంతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపలేకపోయినా, సమిష్టి కృషితో వాటి ప్రభావాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది . భవిష్యత్ తరాలకు సురక్షితమైన, పచ్చనైన , స్థిరమైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉంది.
రాజ్యసభ మాజీ సభ్యులు


