విశాఖ స్టీల్ ప్లాంట్‌లోఘోర ప్రమాదం – Visalaandhra


. 8 మంది మృతి… ఆరుగురి పరిస్థితి విషమం
. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం
. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్ప్పున పరిహారం : ఏఐటీయÖసీ డిమాండ్

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 4.15 గంటలకు స్టీల్ ప్లాంట్ ఎసఎంఎస్-2 లో ల్యాడిల్ పేలి ద్రవ ఉక్కు పడిపోవడంతో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గురిని మెడికవర్ ఆసుపత్రికి, మరో ముగ్గురిని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని షీలా నగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి, స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఐదుగురు ఉద్యోగులు కాగా, ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గొంతెన భాను కుమార్, జి.వి.అప్పారావు, ఎం.కృష్ణ నాగు, కె.ప్రభాకర రావు, గోల్డ్ కుమార్, కాంట్రాక్టు కార్మికులు రమణ, త్రినాథ్, ఎన్.అప్పలరాజు మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రమాదంలో ఇంకా ఎవరయినా చిక్కుకున్నారా అని వెతుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. కాగా ప్రమాదంలో గాయపడిన వారిని రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాస్, అర్జున అప్పారావు, సత్యనశీద్, సూరిబాబు, పైడిరాజుగా గుర్తించారు. 1500 హీట్ డిగ్రీల వేడితో వెళుతున్న స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలడంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారి భయంతో కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిపమాక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పాయి. ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, సీపీ సందర్శించారు. తదుపరి ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
తరచూ ప్రమాదాలు… పట్టించుకోని యాజమాన్యం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రైవేటీకరణ మోజులో పడి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు మండిపడుతున్నారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణం యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరేనని కార్మిక సంఘాలు నేతలు ఆరోపిస్తున్నారు. కాలం చెల్లిన యంత్రాలు, నాసిరకం ముడి సామాగ్రి వాడటం, ఎప్పటికప్ప్పుడు యంత్రాలను నిర్వహణ చేయకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. వీటి ఫలితంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈసారి జరిగిన ప్రమాదం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తక్షణమే ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డి.ఆదినారాయణ డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్ప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టు దిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగానే ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. నాణ్యతను తనిఖీ చేసే వారు లేకపోవడం, అనుభవం లేని కొత్త కాంట్రాక్ట్ కార్మికులను పెట్టడం, యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ, చంద్రబాబు విచారం
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్ప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అనేక మంది కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కాగా జిల్లా కలెక్టర్ , నగర పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *