శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక మే 24 ఆదివారం పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు.
ఇక రాష్ట్రంలో 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 214 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మంచినీరు వెంట తీసుకెళ్లాలని, తలకు గుడ్డ లేదా టోపీ ధరించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మన్యం, అల్లూరి జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.
పిడుగులతో కూడిన వర్షాల సమయంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు. వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు అత్యవసరం తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ఏపీ అంతటా ఎండల ప్రభావం పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


