Last Updated:
Child Suicide: రాజానగరం శ్రీకృష్ణపట్నం లో 13 ఏళ్ల పంజాబీ ఏసు, పెదనాన్న పంజాబీ సత్తిబాబు మందలించాడనే మనస్తాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్య, జీజీహెచ్ లో మృతి
చిన్నపాటి కోపతాపాలు, క్షణికావేశాలు ఒక పసి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పెద్దలు హితవు పలికినా, మంచికే చెప్పినా అర్థం చేసుకోలేని వయసు కావడంతో.. పెదనాన్న మందలించాడనే చిన్న కారణంతో ఓ 13 ఏళ్ల బాలుడు గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన రాజానగరం మండల పరిధిలోని శ్రీకృష్ణపట్నం గ్రామంలో చోటుచేసుకుంది.
సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన పంజాబీ ఏసు (13) అనే బాలుడి జీవితంలో చిన్నప్పటి నుంచే తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నాయి. బాలుడి తండ్రి గతంలోనే మృతి చెందాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి వేరే వివాహం చేసుకుని బాలుడిని వదిలేసి వెళ్ళిపోయింది. కన్నవారు ఇద్దరూ దూరం కావడంతో అనాథగా మారిన ఏసును అతని పెదనాన్న అయిన పంజాబీ సత్తిబాబు తన వద్దకు చేరదీశారు. అప్పటి నుండి సత్తిబాబు వద్దే ఏసు పెరుగుతున్నాడు.
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ఈ క్రమంలో బాలుడు ఏసు ప్రతిరోజూ మండుటెండలో విపరీతంగా తిరుగుతుండేవాడు. ఇలా ఎండలో తిరగడం వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావని, బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండాలని గురువారం నాడు పెదనాన్న సత్తిబాబు బాలుడిని కాస్త గట్టిగా మందలించాడు. బాలుడి భవిష్యత్తు, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే సత్తిబాబు ఆ మాటలు అన్నాడు. ఆ తర్వాత సత్తిబాబు వ్యక్తిగత పని నిమిత్తం రాజమండ్రి వెళ్ళాడు.
అయితే, పెదనాన్న తనను అందరి ముందు కోప్పడ్డాడనే విషయాన్ని బాలుడు ఏసు తట్టుకోలేకపోయాడు. తీవ్రమైన మనస్తాపానికి, ఆవేశానికి గురైన బాలుడు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గడ్డి నివారణకు వాడే గుళికల మందు తాగేసి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు.
రాజమండ్రి నుంచి తిరిగి వచ్చిన పెదనాన్న సత్తిబాబుకు బాలుడు అపస్మారక స్థితిలో పడి ఉండటం, విషం తాగినట్లు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే హుటాహుటిన బాలుడిని కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేర్చి వైద్యులు బాలుడి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే విషం శరీరం అంతటా పాకడంతో పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి సమయంలో బాలుడు ఏసు ఆసుపత్రిలోనే కన్నుమూశాడు.
కన్న కొడుకులా సాకుతున్న పిల్లాడు కళ్లముందే ప్రాణాలు వదలడంతో పెదనాన్న సత్తిబాబు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



