Woman Suicide: శ్రీకాకుళంలో 23 ఏళ్ల యువతి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య.. ఆ కారణమే ప్రాణాన్ని తీసుకుందా.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)


Last Updated:

Woman Suicide: తీవ్ర అనారోగ్యం, వైద్యం ఖర్చుల భారం తట్టుకోలేక ఒడిశాకు చెందిన 23 ఏళ్ల కస్తూరి బెహారా శ్రీకాకుళం ప్రైవేట్ లాడ్జీలో ఉరేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తీవ్రమైన అనారోగ్య సమస్యలు, వాటిని నయం చేసుకోవడానికి కుటుంబ ఆర్థిక స్తోమత సరిపోకపోవడం, తన వల్ల తల్లిదండ్రులు మరింత అప్పులపాలు అవుతున్నారనే మానసిక వేదన ఓ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతి శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ లాడ్జీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విచారకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, రాయగడ జిల్లా, గుణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుండి గ్రామానికి చెందిన కస్తూరి బెహారా (23) అనే యువతి ఈ దారుణానికి పాల్పడింది.

గతంలో కస్తూరి బెహారా తన తల్లిదండ్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తిమ్మారావుపాలెం వద్ద నివసించేది. అక్కడ ఒక స్పిన్నింగ్ మిల్లు విభాగంలో వీరు ఉండేవారు. కస్తూరి తండ్రి అయిన అభిమన్యు బెహారా అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, కొంతకాలం క్రితం కస్తూరి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కూతురిని గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు ఆమెకు ఫిట్స్‌తో పాటు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి పూర్తిగా నయం కావడానికి దాదాపు రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు.

అంత భారీ మొత్తాన్ని భరించే ఆర్థిక స్తోమత తండ్రి అభిమన్యు బెహారాకు లేదు. కూతురికి వైద్యం చేయించలేక, గుంటూరులో బతకడం భారం కావడంతో.. నాలుగు సంవత్సరాల క్రితమే ఈ కుటుంబం తిరిగి ఒడిశాలోని తమ సొంతూరు కురుండి గ్రామానికి వచ్చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ కస్తూరి అనారోగ్య సమస్యలు మరింత తీవ్రమవడమే కాకుండా, ఇంట్లో ఉన్న మిగిలిన ఇద్దరు కుమారుల చదువులు, కుటుంబ పోషణ ఆ తండ్రికి కష్టతరంగా మారింది. తన వైద్యం కోసమే తల్లిదండ్రులు ఇద్దరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, తన వల్లే ఇల్లంతా భారంగా మారిందని కస్తూరి మానసికంగా మరింత కుంగిపోయింది.

ఈ నెల 20వ తేదీన కస్తూరి తన తల్లిదండ్రులతో ఒక అబద్ధం చెప్పింది. తాము పట్టిన కంచూరి బొమ్మిడి/చేపలను విక్రయించడానికి ఒడిశాలోని బ్రహ్మపుర ఆసుపత్రి వద్దకు వెళ్లి వస్తానని చెప్పింది. తల్లిదండ్రులు నిజమేనని నమ్మి పంపించడంతో, మరుసటి రోజు ఉదయం ఆమె గుణుపూర్ నుండి బ్రహ్మపుర రైలు ఎక్కింది. కానీ, ఆమె బ్రహ్మపురంలో దిగకుండా నేరుగా శ్రీకాకుళం చేరుకుంది. శ్రీకాకుళంలోని (ఆముదాలవలస)లో దిగి, అక్కడి నుంచి బస్సు ద్వారా శ్రీకాకుళం నగరానికి చేరుకుంది. శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ లాడ్జీలో ఆన్‌లైన్ ద్వారా ముందుగానే బుక్ చేసుకున్న ఒక గదిని అద్దెకు తీసుకుని, అందులో విశ్రాంతి తీసుకుంది.

రాత్రి సమయంలో కస్తూరి తన మనసులోని ఆవేదనను తట్టుకోలేక బలవన్మరణానికి సిద్ధపడింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన స్నేహితురాలైన జీక్ష్మి బెహారాకు “నేను చనిపోతున్నాను” అంటూ వాట్సాప్‌లో ఒక సందేశాన్ని పంపింది. ఆ తర్వాత తన మరణానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో తన సెల్‌ఫోన్‌ను పూర్తిగా పగలగొట్టి ధ్వంసం చేసింది. ఫోన్‌లోని సిమ్ కార్డును తీసుకుని బాత్రూమ్‌లోని కమోడ్‌లో వేసి ఫ్లష్ చేసేసింది. అనంతరం గదిలోని ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది.

మరోవైపు, కస్తూరి పంపిన మెసేజ్ చూసి ఆందోళన చెందిన ఆమె స్నేహితురాలు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు ఒడిశాలోని గుణుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం నాడు లాడ్జీ గది ఎంతకూ తెరుచుకోకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి శ్రీకాకుళం రెండోపట్టణ పోలీసులకు సమాచారం అందించారు.

ఎస్సై హేమంత్‌కళ్యాణ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి పరిశీలించారు. కస్తూరి అప్పటికే శవమై వేలాడుతూ కనిపించింది. ఒడిశా పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు శుక్రవారం రాత్రికి శ్రీకాకుళం చేరుకున్నారు. కళ్లముందే కుమార్తె మృతదేహాన్ని చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమార్తె బలవన్మరణానికి కేవలం తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని తండ్రి పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ (RIMS) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *