Last Updated:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026-27 అడ్మిషన్లు ప్రారంభం, జూన్ 30 వరకు ఆన్లైన్ దరఖాస్తులు, మే 19 నుంచి జులై 2 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తప్పనిసరి
పదో తరగతి పూర్తి చేసిన తర్వాత త్వరగా ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే విద్యార్థులకు ఐటీఐ కోర్సులు మంచి అవకాశంగా మారుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసిన వారికీ ఉద్యోగాల కోసం పోటీ ఎక్కువవుతున్న నేపథ్యంలో, తక్కువ సమయంలో సాంకేతిక నైపుణ్యాలు నేర్పే ఐటీఐ కోర్సులపై యువత ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఐటీఐలో చేరేందుకు భారీగా ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్థులు AP ITI Admissions Portal ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు జూన్ 30, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఇచ్చారు.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19, 2026 నుంచి జులై 2, 2026 సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత ప్రభుత్వ ఐటీఐ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే అడ్మిషన్ ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
ఐటీఐలో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ విభాగాల్లో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, లైన్‌మ్యాన్, మెకానిక్ వెహికల్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, డ్రాఫ్ట్స్మాన్ సివిల్ వంటి ట్రేడ్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్ వంటి కోర్సులు కూడా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
ఐటీఐ పూర్తి చేసిన వారికి రైల్వేలు, బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని విద్యా నిపుణులు చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక నేరుగా అప్రెంటీస్‌షిప్‌లో చేరడం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ సమయంలో నైపుణ్యాలు నేర్చుకుని త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



