Last Updated:
POCSO Case: పాలకోడేరు విస్సాకోడేరు మైనర్ బాలికపై వెంకట గణేష్, దుర్గ మహేష్, భోగేశ్వరరావు, లక్ష్మణుడు లైంగిక దాడులు, బాలిక ఐదు నెలల గర్భం, POCSO కేసులు నమోదు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన సమాజంలో కామాంధులు రెచ్చిపోయి, తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై వరుసగా అరాచకానికి ఒడిగట్టారు. పెళ్లి చేసుకుంటానని ఒకరు నమ్మించి మోసం చేయగా, ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని మరికొందరు భయపెట్టి, బెదిరించి ఆ బాలిక జీవితాన్ని ఛిద్రం చేశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఒక బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన వెంకట గణేష్ అనే యువకుడు ఆ బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, నమ్మించాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2024 నుంచి పలుమార్లు ఆమెపై శారీరక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం తెలిసిన గణేష్ స్నేహితుడు దుర్గ మహేష్ (బాబి) అనే మరో యువకుడు బాలికను తీవ్రంగా భయపెట్టాడు. జరిగిన విషయాన్ని నలుగురిలో చెప్పి అల్లరి చేస్తానని బెదిరించి, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా లోబరుచుకున్నాడు. కాగా, అదే గ్రామానికి చెందిన భోగేశ్వరరావు అనే మూడో వ్యక్తి బాలిక ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలతో ఉంచనని తీవ్రంగా హెచ్చరించాడు.
ఈ దారుణాలు ఇలా సాగుతుండగా, ఈ నెల 9వ తేదీన గొరగనుమూడి గ్రామానికి చెందిన లక్ష్మణుడు అనే వ్యక్తి రైల్వే గేటు సమీపంలోని సపోటా తోటలోకి బాలికను బలవంతంగా లాక్కొని వెళ్లాడు. ఆమెపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించగా, బాలిక ఎలాగోలా అతని బారి నుంచి తప్పించుకుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చింది.
వరుసగా జరిగిన ఈ ఘాతుకాల వల్ల ఆ మైనర్ బాలిక శారీరకంగా, మానసికంగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ నెల 15న ఆమెను భీమవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ 9వ తరగతి బాలిక ఐదు నెలల గర్భవతి అని తేల్చారు. ఈ వార్తతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీయడంతో, ఆమె కన్నీరు మున్నీరవుతూ తనకు జరిగిన నరకాన్ని, నలుగురు వ్యక్తులు చేసిన అరాచకాలను వివరించింది.
జరిగిన ఘోరంపై బాలిక తల్లిదండ్రులు వెంటనే పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పాలకోడేరు సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) రవి వర్మ గారు తక్షణమే స్పందించి విచారణ చేపట్టారు. బాలిక మైనర్ కావడంతో నిందితులైన వెంకట గణేష్, దుర్గ మహేష్ (బాబి), భోగేశ్వరరావు, లక్ష్మణుడు ఈ నలుగురిపై కఠినమైన పోక్సో (POCSO) చట్టంతో పాటు, భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి వర్మ అధికారికంగా ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ దారుణ సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. దేశంలో నిర్భయ, దిశ వంటి ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చినా, ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ముక్కుపచ్చలారని చిన్నారులపై, మైనర్లపై మృగాల దాడులు ఆగడం లేదు. చట్టాల్లోని లొసుగులు, సుదీర్ఘంగా సాగే న్యాయ ప్రక్రియల వల్ల కామాందులలో భయం లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థులను అరెస్టు చేసి జైలుకు పంపడమే కాకుండా, వీరికి త్వరితగతిన, అత్యంత కఠినమైన శిక్షలు పడినప్పుడే ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమాయక బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఈ నలుగురు కామాందులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



