Top 10 News Today: నేటి టాప్ పది వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


Last Updated:

సీఎం చంద్రబాబు మూడో, నాలుగో బిడ్డలకు నగదు ప్రోత్సాహకాలు, బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు, పెట్రోల్ ధరల పెరుగుదల, పాక్, తైవాన్, మోదీ విదేశీ పర్యటనలపై కీలక వ్యాఖ్యలు.

News18
News18

పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని చూడటమే తన ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పిల్లలు భారం కాదు దేశానికి నిజమైన సంపద అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు ఇస్తామని ప్రకటించారు. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు అందించడంతో పాటు ‘తల్లికి వందనం’ సాయాన్ని పెంచుతామన్నారు.

బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి తొలగించాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరారు. ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. హోంశాఖలో ఆయన ఉంటే కేసు దర్యాప్తుపై రాజకీయ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

బండి భగీరథ్‌పై లుకౌట్‌ నోటీసులు

మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం దాటిపోకుండా ఉండేందుకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఐదు ప్రత్యేక బృందాలు అతని కోసం వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే బంజారాహిల్స్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేశారు.

పెట్రోల్‌ ధరపై రూ.10 పెంపు..?

దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై సగటున రూ.3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఈ నష్టాల భర్తీకి రాబోయే రెండు మూడు వారాల్లో ధరలు లీటరుకు రూ.10 వరకు పెరగొచ్చు.

సీఎం విజయ్‌ను కలిసిన కమల్‌హాసన్‌..

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్‌ను సినీ దిగ్గజం కమల్‌హాసన్ కలిశారు. ఈ సందర్భంగా విజయ్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు అభివృద్ధిపై విజయ్ కి ఉన్న ఆలోచనలను అడిగి తెలుసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సాయం చేయాలని కోరుతూ ఆరు డిమాండ్లను సీఎం ముందుంచారు.

పాక్ డిసైడ్‌ చేసుకోవాలి..!

ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ భారత్‌పైకి ప్రయోగిస్తే పాకిస్థాన్ ఉనికికే ప్రమాదమని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ప్రపంచపటంలో పాక్ అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్నవారిని భారత్ ఒకేలా పరిగణిస్తుందని చెప్పారు. పాక్ భవిష్యత్తులో చరిత్రలో మిగిలిపోవాలనుకుంటుందో లేదో తేల్చుకోవాలని హితవు పలికారు.

వారి స్వాతంత్ర్యం కోసం మేం పోరాడబోం

అమెరికాకు చాలా దూరంలో ఉన్న తైవాన్ రక్షణ కోసం తాము యుద్ధం చేయలేమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనాతో ఉద్రిక్తతల విషయంలో ఇరుప్రాంతాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. భౌగోళిక పరిస్థితులు, చైనా సైనిక శక్తి వల్ల తైవాన్ అంశం తమకు క్లిష్టంగా మారిందన్నారు. వారి స్వాతంత్ర్య ఆకాంక్షల కోసం అంతదూరం ప్రయాణించి పోరాటం చేయలేమని స్పష్టం చేశారు.

నెదర్లాండ్స్ లో ప్రధాని మోదీ

నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా హేగ్ నగరంలో ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో మాట్లాడారు. డిజిటల్ చెల్లింపులు, వందకు పైగా యూనికార్న్ సంస్థలతో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశీయ సెమీకండక్టర్ చిప్‌ల తయారీతో దేశం కీలక పురోగతి సాధించిందని ప్రకటించారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని, భారతీయుల ప్రతిభను నెదర్లాండ్స్ నాయకత్వం ఎప్పుడూ ప్రశంసిస్తుందని చెప్పారు.

విడాకులు వచ్చే వరకూ నేను సినిమాల్లో నటించలేను

నటుడు జయం రవి ఒక ప్రెస్‌మీట్‌లో కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తనను మానసికంగా ఇబ్బంది పెడుతూ పిల్లలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అవమానాలపై ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తన సినిమాలు ఏవీ విడుదల కావని, తాను నటించనని తేల్చిచెప్పారు.

రూ.12 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష..

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా ఆఫర్ ను త్రిష తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ.12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె సినిమాల ఎంపికపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం వల్లే ఆమె నో చెప్పిందని టాక్.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *