Eluru: ఎవరికైనా చెపితే దేవుడు శపిస్తాడు.. ఏలూరు బాలిక అత్యాచారం ఘటనలో పాస్టర్ నిర్వాకం ! |


Last Updated:

14 ఏళ్ల మైనర్ బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలు వాడటంతో బాధితురాలి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Eluru: భక్తుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక చర్చి పాస్టర్ పసికూనపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో కలకలం రేపింది. దైవ ప్రార్థనల పేరుతో నమ్మించి, 14 ఏళ్ల మైనర్ బాలికపై వరుసగా అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తన పాపం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు గర్భనిరోధక మాత్రలు వాడటంతో బాధితురాలి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

ప్రార్థనల పేరుతో వంచన

పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండలంలోని కళ్లచెరువు గ్రామానికి చెందిన చౌటపల్లి రాంబాబు అనే వ్యక్తి గ్రామంలో ఒక చర్చిని నడుపుతూ ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. అదే గ్రామంలో కూలి పనులు చేసుకునే ఒక పేద కుటుంబం తరచూ తమ కష్టాలు తీరాలని రాంబాబు వద్దకు ప్రార్థనల కోసం వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఆ కుటుంబంలోని 14 ఏళ్ల కుమార్తెపై కన్నేసిన ఈ కామపిశాచి, ఆమెను లోబర్చుకున్నాడు.

దేవుడి పేరుతో బెదిరింపులు

పాస్టర్ రాంబాబు బాలికపై తరచూ అత్యాచారం చేస్తూ, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే “దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు” అంటూ దైవ భయాన్ని నూరిపోసి బెదిరించేవాడు. అభం శుభం తెలియని ఆ బాలిక, పాస్టర్ మాటలను నమ్మి, ప్రాణ భయంతో జరగుతున్న దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరించింది.

విషమించిన బాలిక ఆరోగ్యం

ఈ క్రమంలో బాలికకు నెలసరి రాకపోవడంతో, ఆమె గర్భం దాల్చి ఉంటుందని అనుమానించిన పాస్టర్ తన దుర్మార్గాన్ని కప్పిపుచ్చుకోవడానికి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెకు అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలను బలవంతంగా వాడించాడు. దీంతో ఆ బాలికకు విపరీతమైన రక్తస్రావం జరిగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. భయంతో వణికిపోతున్న బాలిక చివరకు తన తల్లికి అసలు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రూరమైన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు – పోలీసుల దర్యాప్తు

తడికలపూడి ఎస్సై వల్లీపద్మ బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు రాంబాబుపై పోక్సో (POCSO) చట్టం కింద, ఇతర కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆధ్యాత్మికత పేరుతో ఇటువంటి అకృత్యాలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *