Last Updated:
ఓ కిలేడీ తన పరిచయస్తుడి వద్ద నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు అప్పు అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. నకిలీ పోలీస్ అధికారిణి దౌర్జన్యం తాళలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది.
Anantapur: అనంతపురం జిల్లాలో ఆర్థిక నేరాలు, మోసాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాలను వణికించిన హనీ ట్రాప్ ఉదంతం మరువకముందే, మరో విస్తుగొలిపే మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ‘మహిళా డీఎస్పీ’నని నమ్మించి, ఓ కిలేడీ తన పరిచయస్తుడి వద్ద నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి, ఇప్పుడు అప్పు అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. నకిలీ పోలీస్ అధికారిణి దౌర్జన్యం తాళలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది.
ఈనాడు కథనం ప్రకారం.. కళ్యాణదుర్గం మండలం ముదినాయనపల్లి గ్రామానికి చెందిన సరస్వతి అనే మహిళకు అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రంగనాయకులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె తనను తాను పోలీస్ అధికారిణిగా పరిచయం చేసుకుంది. తాను అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ (DSP) గా విధులు నిర్వహిస్తున్నానని రంగనాయకులను నమ్మబలికింది. ఆమె మాటలను నిజమని నమ్మిన రంగనాయకులు, 2023లో తన వరుసకు సోదరుడైన రామానాయుడుకు సరస్వతిని పరిచయం చేశాడు.
రామానాయుడుతో పరిచయం పెంచుకున్న సరస్వతి, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అసలు కథ మొదలుపెట్టింది. తన పిల్లల ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రి ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలని రామానాయుడును కోరింది. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారిణి అడుగుతోంది కదా అని నమ్మిన బాధితుడు, తన వద్ద ఉన్న నగదును వివిధ దఫాలుగా ఆమెకు అందజేశాడు. ఇలా సుమారు రూ.40 లక్షల వరకు ఆమె అప్పుగా తీసుకుంది. జాగ్రత్త కోసం రామానాయుడు ఆమె వద్ద నుంచి ప్రాంసరీ నోట్లు కూడా రాయించుకున్నాడు.
కొంతకాలం గడిచిన తర్వాత రామానాయుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా, సరస్వతి అసలు స్వరూపం బయటపడింది. మొదట్లో తనకు చాలా ఆస్తులు ఉన్నాయని, తన తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, త్వరలోనే అప్పు తీర్చేస్తానని నమ్మబలికింది. ఇలా మూడేళ్లపాటు కాలయాపన చేస్తూ వచ్చింది. బాధితుడు గట్టిగా నిలదీయడంతో, “డబ్బులు ఇచ్చేది లేదు.. నీ ఇష్టం వచ్చింది చేసుకో.. ఎక్కువ మాట్లాడితే నీకు ఇబ్బంది తప్పదు” అంటూ బాధితుడిని బెదిరించడం ప్రారంభించింది. ఒక డీఎస్పీగా తనకున్న పలుకుబడితో ఇబ్బంది పెడతానని హెచ్చరించింది.
ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన రామానాయుడు ఆరా తీయగా, అసలు ఆమె పోలీసు అధికారిణి కాదని, కేవలం ఖాకీ దుస్తులు వేసుకుని అందరినీ బురిడీ కొట్టిస్తోందని తెలుసుకుని హతాశుడైయ్యాడు. ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా, తనపైనే దౌర్జన్యం చేస్తుండటంతో చేసేదేమీ లేక అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్ఛార్జ్ సీఐ పుల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో జిల్లా వాసులు హడలెత్తిపోతున్నారు. పోలీస్ అధికారులమని చెప్పి అప్పులు అడిగే వారి పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖాకీ డ్రస్సు వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చినంత మాత్రాన నమ్మవద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



