Last Updated:
అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు.
Eluru: నమ్మిన భర్తను కడతేర్చడానికి ఒక భార్య వేసిన పథకం, ప్రియుడితో కలిసి ఆమె చేసిన క్రూరమైన ఆలోచన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ గురువారం మీడియా ముందుకు తీసుకువచ్చారు. కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో, పదేళ్ల బంధాన్ని కాదని భర్తను అత్యంత కిరాతకంగా చంపించిన వైనం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం.. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి సులేమాన్ రాజు (41) భార్య దుర్గామణికి, అదే గ్రామ సచివాలయంలో పనిచేసే పలగాని వెంకన్నబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వెంకన్నబాబు కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి వాసి. వీరిద్దరి వ్యవహారం కొంతకాలం క్రితం సులేమాన్ రాజుకు తెలిసింది. అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు.
భర్త వేధింపులు భరించలేక, తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని దుర్గామణి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడు వెంకన్నబాబుకు చెప్పి, భర్తను చంపాలని కోరింది. దీంతో వెంకన్నబాబు బాపులపాడు మండలం బండారుగూడెంకు చెందిన కలతోటి మణికంఠ, కలతోటి సాయిశ్రీనివాస్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సులేమాన్ రాజును హత్య చేయడానికి ఏకంగా రూ.12 లక్షల సుపారీ ఇచ్చేందుకు అంగీకరించారు.
గత నెల 17వ తేదీ రాత్రి నిందితులు పథకం ప్రకారం సులేమాన్ రాజును కారులో ఎక్కించుకున్నారు. కొండపావులూరు సమీపంలోని జగనన్న ఇళ్ల సముదాయం వద్ద ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) గేటు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో సాయిశ్రీనివాస్, అతని స్నేహితుడు జశ్వంత్ రాయ్ కలిసి సులేమాన్ మెడకు మొబైల్ చార్జింగ్ వైరును బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు.
మృతదేహాన్ని గుర్తించిన ఆగిరిపల్లి పోలీసులు ఎస్‌ఐ కె.శుభశేఖర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ విశ్లేషించిన పోలీసులకు నిందితుల కదలికలపై అనుమానం వచ్చింది. గురువారం గన్నవరం వద్ద నిందితులైన కలతోటి సాయిశ్రీనివాస్, మద్దాలి జశ్వంత్‌రాయ్, కలతోటి మణికంఠ, పలగాని వెంకన్నబాబు, రెడ్డి దుర్గామణిలను పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కారు, 5 సెల్‌ఫోన్లు, రూ.75 వేల నగదు, మరియు మెడకు బిగించిన చార్జింగ్ కేబుల్ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సలహా ఇచ్చిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



