ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా
. పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు
. కోర్టును ఆశ్రయించనున్న విజయ్
. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు
. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్
. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే
చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత వ్యవహారం తమిళనాడు గవర్నర్ పరిధిలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతును ధ్రువీకరిస్తూ లేఖ సమర్పించాలని గవర్నర్ ఆర్వీ అర్లేకర్ టీవీకే అధినేత విజయ్ను కోరారు. పూర్తిస్థాయి మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేది లేదని గవర్నరు మొండికేశారు. గురువారం ఉదయం విజయ్ మరోసారి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, కొంత గడువు ఇస్తే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నరుకు విజయ్ విన్నవించారు. తమకు113 ఎమ్మెల్యేలతో (108 టీవీకే ఎమ్మెల్యేలు, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) మద్దతుతో పాటు రెండు వామపక్ష పార్టీలు (4 ఎమ్మెల్యేలు), మరో రెండు ప్రాంతీయ పార్టీల (6 ఎమ్యెల్యేలు) మద్దతు ఉందని విజయ్ చెప్పినట్టు తెలుస్తోంది. బలపరీక్షకు తాను సిద్ధమని విజయ్ పేర్కొన్నారు. అందుకు గవర్నరు సుముఖత చూపలేదు. 118 మంది ఎమ్మెల్యేలను చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని గవర్నరు. చెప్పారు. దీంతో కోర్టును ఆశ్రయించాలని టీవీకే పార్టీ భావిస్తోంది. విజయ్ గురువారం మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లి… గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ భేటీపై లోక్‌భవన్ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘ఇవాళ గవర్నర్ అర్లేకర్‌తో విజయ్ భేటీ అయ్యారు. మెజార్టీ కనిపించడం లేదని గవర్నరు వివరించారు. మెజార్టీతోనే రావాలని గవర్నర్ సూచించారు’ అని లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరే ఇతర పార్టీని ఆహ్వానించబోమని విజయ్‌కు గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆహ్వానం మేరకే విజయ్ ఆయనను కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు వీరి భేటీ జరిగింది.
మరోవైపు గవర్నరు అర్లేకర్ తీరుపై రాజకీయ పార్టీలు, మేధావులు విరుచుకుపడ్డారు. ప్రజల మద్దతుతో గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును అవమానించడమేనని, గవర్నరు వైఖరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు. తక్షణమే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, అసెంబ్లీలో బలప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ పోకడలను సైతం తూర్పారబట్టారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటుకుగాను విజయ్‌కు అనుమతి ఇవ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వీసీకే పార్టీలు గవర్నర్‌ను కోరాయి. డీఎంకే సైతం విజయ్‌కు అవకాశం ఇవ్వాలని గవర్నరుకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు, త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అన్నాడీఎంకే బాంబు పేల్చింది. రాష్ట్రంలో అద్భుతం జరగబోతుందని, తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్ప్పుకుంది. పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. సీనియర్ నేతల పర్యవేక్షణలో 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు చేరుకున్నారు. సీవీ షణ్ముగం నేతృత్వంలో మిగతా ఎమ్మెల్యేలను మరొక రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. తమ ఎమ్మెల్యేలపై ఒత్తిడి రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గవర్నరు తీరుకు నిరసనగా టీవీకే కార్యకర్తలు గురువారం లోక్‌భవన్ వద్ద ఆందోళనకు దిగారు. తమ నేత విజయ్ ప్రమాణ స్వీకారానికి అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సైతం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. విజయ్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు సేలంలో ఆందోళనకు దిగాయి. గవర్నరును వెనుక నుంచి నడిపిస్తున్న బీజేపీపై మండిపడ్డాయి.
The post తొలగని అనిశ్చితి appeared first on Visalaandhra.


