Last Updated:
పిఠాపురం టీడీపీ నేత వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించగా, ప్రెస్మీట్లో ఆవేదన వ్యక్తం చేసి మధ్యలోనే వెళ్లిపోవడం రాజకీయ చర్చకు దారితీసింది
పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు తెరలేపే పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బయటకు పార్టీ నిర్ణయానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నట్టు మాట్లాడిన వర్మ మాటల్లో మాత్రం తీవ్ర ఆవేదన స్పష్టంగా కనిపించింది. చివరకు భావోద్వేగానికి లోనై మీడియా సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది.
పార్టీ కోసం పని చేయమన్నారు చేశాను.. గెలిపించమన్నారు గెలిపించాను.. అధిష్టానం ఏం చెబితే అది చేయడమే నా కర్తవ్యం అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సొంత రాజకీయ భవిష్యత్తును పక్కన పెట్టి పోటీ నుంచి తప్పుకోవడం, పార్టీ ఆదేశాలను శిరసావహించడం వంటి అంశాలను ఆయన పరోక్షంగా గుర్తు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక తనను ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం వెనుక కూడా తానే కారణమన్నట్టు వర్మ చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. నేనొక్కడినే చేయలేకపోతున్నాను అని చెప్పాను.. అందుకే ప్రత్యేక టీంను వేస్తున్నారు. ఈ విషయంపై నాతో చర్చ జరిగింది.. లోకేష్‌తో మాట్లాడాను అని చెప్పినప్పటికీ ఆయన ముఖంలో కనిపించిన బాధ మాత్రం వేరే కథ చెబుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పిఠాపురంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వర్మ కీలక నేత. అనేకసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు స్థానికంగా బలమైన కేడర్ ఉంది. అలాంటి నేతకు ఎమ్మెల్సీ అవకాశమూ రాకపోవడం, ఇప్పుడు ఇన్చార్జ్ పదవీ కూడా పోవడం ఆయన అనుచరులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. బయటకు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు కనిపించినా.. లోపల మాత్రం వర్మ తీవ్ర మనస్తాపంతో ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఇటీవల పిఠాపురం రాజకీయాల్లో జనసేన-టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారింది. ముఖ్యంగా ప్రెస్మీట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వర్మ ఇచ్చిన సమాధానాల్లో అసహనం, ఆవేదన స్పష్టంగా కనిపించాయి. అధిష్టానం చెప్పిందే ఫైనల్ అని పదే పదే చెబుతూ వచ్చిన ఆయన చివరకు భావోద్వేగానికి గురై అక్కడి నుంచి వెళ్లిపోవడం పిఠాపురం రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
ఇప్పుడంతా ఒకే ప్రశ్న చుట్టూ చర్చ సాగుతోంది.. పార్టీ ఏం చెబితే అదే చేస్తా అంటున్న వర్మ ఫోటో కాల్ వెనుక అసలు సందేశం ఏమిటి? ఇది కేవలం ఆవేదనా? లేక భవిష్యత్తు రాజకీయాలకు సంకేతమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వర్మ ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీలోనే కొనసాగుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కానీ పిఠాపురం రాజకీయాలు మాత్రం ఇకపై మరింత హాట్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


