Suspicious Death: హత్యా లేక ఆక్సిడెంట్.. పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి పడి మహిళ మృతి.. అసలు విషయం ఇదే.. | గుంటూరు వార్తలు (Guntur News)


Last Updated:

Suspicious Death: క్రోసూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చిన రేణుక పై అంతస్తు నుంచి పడి మృతి, కానిస్టేబుల్ వెంకటేశ్వరరెడ్డి వివాదం నేపథ్యంగా అనుమానాలు, కేసు దర్యాప్తులో ఉంది

News18
News18

గుంటూరు జిల్లా క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విచారణ నిమిత్తం స్టేషన్‌కు వచ్చిన మహిళ, భవనం పై అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆమె మరణం వెనుక ఉన్న గతాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈనాడు కథనం ప్రకారం మృతురాలు రేణుక (39) బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వ్యక్తి. ఆమెకు గతంలో నరసరావుపేటకు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, పదేళ్ల క్రితం భర్తతో మనస్పర్థలు రావడంతో ఆమె విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో చీరాల కోర్టులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

తర్వాతి కాలంలో వెంకటేశ్వరరెడ్డి పొన్నూరుకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన మరో యువతిని వివాహం చేసుకోవడంతో రేణుకతో గొడవలు మొదలయ్యాయి. తనను మోసం చేశాడంటూ రేణుక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంకటేశ్వరరెడ్డిని సస్పెండ్ చేశారు. కొంతకాలం తర్వాత సస్పెన్షన్ ఎత్తివేసి, అతడిని క్రోసూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన గురజాలలో విధులు నిర్వహిస్తున్నారు.

స్టేషన్‌లో అసలేం జరిగింది?

వెంకటేశ్వరరెడ్డి క్రోసూరులో పనిచేస్తున్న సమయంలోనే రేణుక తన మకాంను అక్కడికి మార్చి, ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. సస్పెన్షన్ కేసుకు సంబంధించి శాఖాపరమైన విచారణలో భాగంగా మంగళవారం సాయంత్రం సిఐ సురేష్ ఆమెను క్రోసూరు స్టేషన్‌కు పిలిపించారు. పై అంతస్తులోని సిఐ కార్యాలయంలో విచారణ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం: విచారణ సమయంలో తనకు నీరసంగా ఉందని, మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదని రేణుక పోలీసులకు తెలిపింది. మానవతా దృక్పథంతో పోలీసులు ఆమెకు ఆహారం తెప్పించారు. భోజనం చేసిన తర్వాత ఆమెకు వాంతులు అయ్యాయి. వాంతులు చేసుకోవడం కోసం ఆమె పై అంతస్తులోని పిట్టగోడ వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో అకస్మాత్తుగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో లేదా కళ్ళు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

కింద పడిన రేణుకకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వెంటనే ఆమెను అంబులెన్స్‌లో మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఈ వార్త తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికంగా సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ప్రమాదవశాత్తు పడిందని కొందరు, కాదు ఫిట్స్ రావడం వల్లే పడిందని మరికొందరు పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. విచారణకు వచ్చిన మహిళను ఒంటరిగా పై అంతస్తులో పిట్టగోడ వద్దకు ఎందుకు పంపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత పదేళ్లుగా కానిస్టేబుల్‌తో సాగుతున్న ఈ వివాదం ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేసిందా? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. సిఐ సురేష్ స్పందిస్తూ.. విచారణ నిమిత్తం వచ్చిన మహిళకు మూర్ఛతో పాటు వాంతులు రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *