. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం
. మోదీ సర్కారు బాదుడు
. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు
. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ.993.50 మేర అదనపు భారాన్ని పెంచుతూ కేంద్రం సామాన్యులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ.3,315 కు చేరుకుంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ఎన్నికలు ముగియగానే ప్రజా ప్రయోజనాలను విస్మరించి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ పెంపు తీవ్ర భారంగా మారింది. ఈ ధరల పెంపుతో చిన్న వ్యాపారస్తులు, అల్పాహార సెంటర్ల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కొరత, యథేచ్ఛగా సాగుతున్న బ్లాక్ మార్కెటింగ్ దందా… చిరు వ్యాపారుల జీవితాలను అతలాకుతలం చేస్తుంటే, తాజాగా కేంద్రం పెంచిన ధరలు వారిపై పిడుగులా పడ్డాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు తదితర నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో సైతం చిరు వ్యాపారాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు… సామాన్య వ్యాపారుల పొట్టకొట్టే ఈ ధరల పెంపుపై నోరు మెదపకపోవడం శోచనీయం. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు, ఆర్థిక అస్థిరతలతో ఇప్పటికే సతమతమవుతున్న చిరు వ్యాపారులపై పెరిగిన ఇంధన వ్యయం తీవ్ర భారంగా పరిణమించింది. గ్యాస్ సరఫరాలో ఉన్న అడ్డంకులు తొలగించకుండానే, ఇలా ధరలను అమాంతం పెంచడం వల్ల ఇప్పటికే అనేక చిరు హోటళ్లు పూర్తిగా మÖతపడగా, మిగిలినవి అరకొర కార్యకలాపాలతో మనుగడ సాగిస్తున్నాయి. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన వందలాది మంది పేద కార్మికులు రోడ్డున పడి, ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. కష్టజీవుల పొట్టకొట్టే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా సీపీఐ సహా వామపక్ష పార్టీలు ఇప్పటికే పోరాటాలు సాగిస్తున్నాయి. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల వల్ల ఇంధన ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా, ఆ భారాన్ని కార్పొరేట్ సంస్థల లాభాల నుంచి తగ్గించకుండా నేరుగా సామాన్యుడిపై నెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన కనీస బాధ్యతను విస్మరించి, ఒకసారి ధరలు పెంచిన కొద్ది రోజులకే మళ్లీ భారీగా బాదడం దారుణం. నిరంతరం శ్రమించే చిన్న వ్యాపారులను ఈ ధరల పెరుగుదల కోలుకోలేని దెబ్బ తీస్తూ, వారి జీవనోపాధిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది.
స్తంభిస్తున్న చిరు వ్యాపారాలు
గ్యాస్ సరఫరాలో సృష్టిస్తున్న కృత్రిమ కొరత, రాజ్యమేలుతున్న బ్లాక్ మార్కెట్ దందా చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారాయి. సమయానికి గ్యాస్ అందక పోవడంతో గత్యంతరం లేక హోటళ్లను మÖసివేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు సిలిండర్లు కొనుగోలుతో పెట్టుబడి వ్యయం భారమై, ఆ భారాన్ని చివరకు సామాన్య వినియోగదారులపైనే వేయాల్సి వస్తోంది. ఫలితంగా హోటళ్లు, అల్పాహార సెంటర్లలో సామాన్యుడి భోజనం, అల్పాహారం ఖరీదైపోతోంది. విజయవాడ వంటి నగరాల్లో హోటళ్లు, బేకరీల సంఖ్య అధికంగా ఉండటంతో గ్యాస్ వినియోగమÖ ఎక్కువే. ఒక్కో హోటల్ రోజుకు 2 నుంచి 5 సిలిండర్లు వాడాల్సి ఉండగా, పెరిగిన ధరలతో వారి బడ్జెట్ తలకిందులవుతోంది. విశాఖపట్నంలో ఐటీ, పర్యాటక రంగాల విస్తరణతో ఆహార పరిశ్రమ కీలకంగా మారినప్పటికీ, ఈ ఇంధన బాదుడు వల్ల చిన్న చిన్న ఫుడ్ స్టాళ్ల నిర్వహణ భారమై మÖతపడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా విద్యుత్ లేదా ఇండక్షన్ పరికరాల వైపు మళ్లుదామన్నా అవి పూర్తి స్థాయిలో గ్యాస్‌కు సాటి రాకపోవడం వ్యాపారులను మరింత ఇరకాటంలోకి నెట్టింది. గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లోని శ్రమజీవుల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారింది. ఈ ధరల పెంపు అనేది కేవలం ఒక ఆర్థిక గణాంకం మాత్రమే కాదు, లక్షలాది మంది చిరు వ్యాపారుల ఉపాధిని దెబ్బతీసి, వారిని ఆకలి కోరల్లోకి నెట్టే కుట్ర. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ధోరణి వీడి, తక్షణమే ఈ భారమైన ధరలను తగ్గించి శ్రమజీవుల జీవనోపాధిని రక్షించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో చిన్న వ్యాపార రంగం కోలుకోలేని విధంగా సంక్షోభంలోకి జారిపోవడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కనిపించే ప్రమాదం ఉంది. సామాన్యుల నడ్డి విరుస్తూ పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కేజీ బేసిన్లో లభిస్తున్న సహజ వనరులపై రాష్ట్రానికే తొలి హక్కు ఉండాలన్న డిమాండ్‌తో కనీసం 50 శాతం గ్యాస్, చమురు వాటాను రాష్ట్రానికి కేటాయించాలని వామపక్ష పార్టీలు నినదిస్తున్నాయి. గ్యాస్, ఆయిల్ రంగాల్లో రాజ్యమేలుతున్న బ్లాక్ మార్కెట్ మాఫియాను కఠినంగా కట్టడి చేయాలని, సంక్షోభంలో ఉన్న చిరు వ్యాపారస్తులకు ఆసరాగా ప్రత్యేక సబ్సిడీలు అందించడంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల అవసరాలను గుర్తించి గ్యాస్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించకపోతే… రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని, శ్రమజీవుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధానాలను సహించేది లేదని వామపక్ష శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.


