నష్టాల నుంచి లాభాల దిశగా బంతి పూలు.. వీకోట మార్కెట్‌లో రైతన్నలకు పండుగ! marigold flower farming | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

చిత్తూరు వీకోట బంతి పూల ధర కిలోకు 40 నుంచి 50 రూపాయలకు పెరిగి, నాలుగు నెలల నష్టాల తర్వాత రైతులకు లాభాలు, మల్చింగ్ పద్ధతి దిగుబడిని పెంచుతోంది

+

News18

News18

చిత్తూరు జిల్లాలోని వీకోట పూల మార్కెట్ నుంచి రైతన్నలకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. గత నాలుగు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన బంతి రైతులకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. ఒకప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా రాక తోటలలోనే పంటను వదిలేసి యంత్రాలతో నేలను చదును చేసిన రైతులు.. ఇప్పుడు అదే బంతి పంటతో మళ్లీ లాభాల దిశగా పయనిస్తున్నారు. ప్రస్తుతం వీకోట మార్కెట్‌లో కిలో బంతి ధర రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుండటంతో రైతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

ఏప్రిల్ మొదటి వారం వరకు నిరాశలో ఉన్న రైతులకు ఒక్కసారిగా మార్కెట్ మార్పు ఆశ్చర్యాన్ని కలిగించింది. ధరలు పెరగడంతో తోటల్లో మిగిలిన పంటకే మంచి డిమాండ్ ఏర్పడింది. పెట్టుబడి తక్కువ, కూలీల ఖర్చు కూడా చాలా తక్కువగా ఉండటం, పైగా మంచి ధర లభించడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మల్చింగ్ పద్ధతి రైతులకు లాభాలను పెంచుతున్నదని చెబుతున్నారు.

గతంలో నేలను చదును చేసి, సేంద్రియ ఎరువులతో సారవంతం చేసి, కాడెద్దుల సాయంతో సాలులు పోసి మొక్కలు నాటే వారు. కానీ ఆ పద్ధతిలో దిగుబడి తక్కువగా ఉండటం, కూలీల కొరత, పిచికారీ సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం నేలను దుక్కి చేసి మల్చింగ్ వేసి సాగు చేయడంతో కలుపు సమస్య తగ్గి, నీటి వినియోగం తగ్గి, దిగుబడి గణనీయంగా పెరుగుతోందని చెబుతున్నారు. ఇక పంటను వర్షాల ప్రభావం నుంచి కాపాడేందుకు రైతులు వినూత్నంగా తొడుగులు ఏర్పాటు చేసి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్ష సూచనలు ఎక్కువగా ఉండటంతో ఈ పద్ధతి వారికి మరింత రక్షణగా మారింది. పంట దిగుబడిని పెంచడంలో ఇది కీలకంగా మారిందని రైతులు చెబుతున్నారు.

బంతి పూలలో ఎల్లో, ఆరెంజ్ అనే రెండు రకాలున్నా మార్కెట్‌లో ఆరెంజ్ రకానికి ఎప్పుడూ కొద్దిగా అధిక ధరే లభిస్తోంది. ప్రస్తుతం కూడా ఎల్లోతో పోలిస్తే ఆరెంజ్‌కు రూ.5 నుంచి రూ.10 వరకు ఎక్కువ ధర వస్తోంది. అందుకే రైతులు తమ భూమిలో సగం సగంగా ఈ రెండు రకాలను సాగు చేస్తూ మార్కెట్ డిమాండ్‌ను బట్టి లాభాలు పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చూస్తే బంతి పూలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

బంతి సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు, గరప నేలలు, రేగడి నేలలు అనుకూలమని రైతులు చెబుతున్నారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇలా ఏ కాలంలోనైనా సాగు చేయవచ్చు. అయితే అధిక వేడి ఉంటే పూల పరిమాణం తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు. విత్తనాలను ముందుగా నారుమడిలో చల్లి 25 నుంచి 30 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటాలి. మొక్కల మధ్య 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరం పాటించడం, క్రమం తప్పకుండా కలుపు తీయడం, 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీరు పెట్టడం అవసరమని చెబుతున్నారు.

అలాగే నాటిన 30 నుంచి 35 రోజుల తర్వాత మొక్క అగ్రభాగాన్ని తుంచడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి అధిక దిగుబడి సాధ్యమవుతుందని రైతులు వివరించారు. అల్లం వంటి పంటలతో పాటు అంతర పంటగా కూడా బంతిని సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్, సీజన్‌ను బట్టి ఎకరాకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని రైతన్నలు శ్రీరాములు, దామోదర్ నాయుడు తెలిపారు. సరైన మెళకువలు పాటిస్తే బంతి పంట రైతులకు స్థిరమైన ఆదాయ వనరుగా మారుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నిరాశ తర్వాత వచ్చిన ఈ ధరల పెరుగుదల బంతి రైతులకు నిజంగా కొత్త ఆశలను నింపుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *