Last Updated:
కడప చెన్నూరులో ప్రేమజంట యోగేంద్ర, హేమశ్రీ చిన్న మనస్పర్థతో వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య, పెద్దలు భావోద్వేగంతో ఒకేచోట పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించారు
మరణంలోనైనా విడిపోకూడదన్న భావంతో, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రేమికులను ఒకేచోట పక్కపక్కనే ఖననం చేసిన ఘటన కడప జిల్లాలో కంటతడి పెట్టిస్తోంది. కలిసి జీవించాలని కలలు కన్న ఈ జంట, చివరికి కలిసి మట్టిలో కలవడం గ్రామస్థులను కలచివేసింది.
వారిద్దరూ ఒకే ఊరిలో పెరిగారు.. ఒకే బడిలో ఆటపాటలతో సాగారు. ఆ స్నేహం కాస్తా కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. భవిష్యత్తులో గొప్పగా స్థిరపడి, కులమతాల అడ్డుగోడలను దాటి పెళ్లిపీటలు ఎక్కాలని వారు ఎన్నో కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒక చిన్న మనస్పర్థ వారి నిండు నూరేళ్ల జీవితాలను అర్ధంతరంగా తుంచేసింది.
కడప నగరంలోని ఒకే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న వీరిద్దరూ, తమ ప్రేమను గెలిపించుకోవాలని కష్టపడి చదువుతున్నారు. అయితే వారి ఏదో చిన్న గోడవ జరిగింది.. దీంతో యోగేంద్ర మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. తన ప్రాణంగా ప్రేమించిన వాడు ఇక లేడన్న వార్త విన్న హేమశ్రీ, ఆ విరహాన్ని భరించలేకపోయింది. అతడు లేని లోకంలో తను మాత్రం ఎందుకు ఉండాలని భావించిందో ఏమో, వెంటనే బలవన్మరణానికి పాల్పడింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు వదలడంతో చెన్నూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటిగా నడుస్తారని భావించినా.. చివరకు పాడెలపై పక్కపక్కనే సాగిపోవడం చూసి ఇరు కుటుంబాల వారు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఎలాగూ కలిసి జీవించలేకపోయారు, కనీసం మరణంలోనైనా వారిని విడదీయకూడదని పెద్దలు భావోద్వేగపూరితమైన నిర్ణయం తీసుకున్నారు. చెన్నూరు సమీపంలోని ఒకే ప్రదేశంలో పక్కపక్కనే ఇద్దరికీ అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి పందిరిలో కలవాల్సిన ఆ జంట, ఇప్పుడు వల్లకాడులో నిశ్శబ్దంగా పక్కపక్కనే నిద్రపోతోంది. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు వదిలిన ఈ జంట ఉదంతం, చిన్నపాటి కోపతాపాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో చెప్పడానికి ఒక కన్నీటి సాక్ష్యంగా మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kadapa (Cuddapah),Y.S.R.,Andhra Pradesh



