పైపుల నిండా కష్టాలే… – Visalaandhra


. పీఎన్జీ విస్తరణకు ‘గ్యాస’ కరవు!
. ఆరు నెలల్లో 10 లక్షల లక్ష్యం సాధ్యమేనా?
. సిద్ధంగా ఉన్నా అందని సరఫరా
. మొగ్గు చూపని వినియోగదారులు
. ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అవరోధాలు

విశాలాంధ్ర-సచివాలయం : ముంగిట ముచ్చటగా గ్యాస్ పైపులైన్లు… మెరుస్తున్న మీటర్లు… ఏడాదికి రూ.2,400 నగదు ప్రోత్సాహం! ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది? కానీ, వాస్తవంలోకి వస్తే కథ వేరు. పైపులు ఉన్నాయి కానీ పంపడానికి గ్యాస్ లేదు! పంపిణీ సంస్థలు వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్నా… సరఫరా వ్యవస్థలు మొరాయిస్తున్నాయి. మరోవైపు, ‘ఫోన్ కొడితే సిలిండర’ వస్తున్న తరుణంలో కొత్త మార్పుపై ప్రజల్లోనూ అనాసక్తే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 10 లక్షల కనెక్షన్ల లక్ష్యం… క్షేత్రస్థాయిలో గ్యాస్ సరఫరా కొరత, మౌలిక వసతుల జాప్యం మధ్య సందిగ్ధంలో పడింది. ప్రోత్సాహకాలకు ‘దీపం’ వెలుగున్నా… ఆశించిన స్థాయిలో ‘ఆసక్తి’ లేకపోవడంతో పీఎన్జీ విస్తరణ అడుగులు తడబడుతున్నాయి. రాష్ట్రంలో ఇంధన విప్లవానికి నాంది పలకాలని, గృహ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా గ్యాస్ అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను భారీ ఎత్తున విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఆరు నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం ఈ ఆశయానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం మెండుగా ఉన్నప్పటికీ, అటు సరఫరా లోపం, ఇటు వినియోగదారుల్లో ఆసక్తి లేకపోవడం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నీరుగారుస్తున్నాయి. పీఎన్జీ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకి గ్యాస్ అందుబాటులో లేకపోవడం. రాష్ట్రంలో గ్యాస్ పంపిణీ సంస్థలు సుమారు రూ.760 కోట్ల భారీ పెట్టుబడితో పైప్‌లైన్ల నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక నగరాల్లో వీధివీధినా పైప్‌లైన్లు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 1.7 లక్షల ఇళ్లలో కేవలం మీటర్లు అమర్చి కనెక్షన్లు ఇవ్వడమే తరువాయి. కానీ ఆ పైప్ లైన్ల ద్వారా పంపిణీ చేయడానికి తగినంత సహజ వాయువు సమీకరణ జరగడం లేదు. గ్యాస్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలపై, విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ట్రంక్ పైప్‌లైన్ల నిర్మాణం పూర్తికాకపోవడం, భూసేకరణలో ఇబ్బందులు, అనుమతుల జాప్యం వంటి కారణాలతో గ్యాస్ పంపిణీ సంస్థలు చేతులు కట్టుకు కూర్చున్నాయి. ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కొత్త కనెక్షన్లు కేవలం 2,000 మాత్రమే కావడం గమనార్హం. ప్రభుత్వం పీఎన్జీని ప్రోత్సహించడానికి ‘దీపం 2.0’ పథకం ద్వారా ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా పీఎన్జీ కనెక్షన్ తీసుకునే వారికి సంవత్సరానికి రూ.2,400 నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అంటే ఉచిత సిలిండర్ల ప్రయోజనాన్ని నగదు రూపంలో అందిస్తోంది. అయినప్పటికీ వినియోగదారుల నుంచి స్పందన కరువైంది. దీనికి ప్రధాన కారణం ఎల్పీజీపై ఉన్న నమ్మకం, ప్రస్తుతం సిలిండర్ల లభ్యత సులభంగా ఉండటం. గతంలో గ్యాస్ బుక్ చేస్తే నెల రోజులు పట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇప్ప్పుడు ఫోన్ చేసిన కొద్ది గంటల్లోనే సిలిండర్ ఇంటికి వస్తోంది. దీంతో కొత్తగా పీఎన్జీకి మారి, ఇళ్లలో పైపులు వేయించుకోవడం, ఇతర మౌలిక మార్పులు చేసుకోవడం ప్రజలకు భారంగా అనిపిస్తోంది. పైగా, ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ఎంతవరకు సురక్షితం అనే విషయంలో ఇంకా ప్రజల్లో అవగాహన లోపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 66,892 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి పెట్టిన 10 లక్షల కనెక్షన్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి నెలా లక్షన్నర కంటే ఎక్కువ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గ్యాస్ కేటాయింపుల్లో ఉన్న లోపాలు, పంపిణీ వ్యవస్థ అసంపూర్తిగా ఉండటం చూస్తుంటే ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. గ్యాస్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టినా, వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల్లో పీఎన్జీ ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పిస్తేనే ఈ పథకం పట్టాలెక్కే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *