Last Updated:
శ్రీ సత్యసాయి జిల్లాలో తండ్రీకొడుకులు ChatGPT తో మంత్రి సత్యకుమార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ బదిలీ ఉత్తర్వులు సృష్టించి నర్సును మోసం, ఇద్దరూ అరెస్ట్
అతి తెలివి అట్టడుగుకు తొక్కుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి వాడాల్సింది పోయి, నేరాలకు ఉపయోగిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల ఉదంతం నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్నే ఏకంగా AI సాయంతో ఫోర్జరీ చేసి, నకిలీ బదిలీ ఉత్తర్వులు సృష్టించిన వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కదిరి మండలం కౌలేపల్లి గ్రామానికి చెందిన గంగాద్రి, అతని కుమారుడు వేణు అనే యువకుడు కలిసి చేసిన ఈ ఘరానా మోసం పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న రవనమ్మ అనే మహిళను ఆమె సొంత ప్రాంతమైన తనకల్లుకు బదిలీ చేయిస్తామంటూ గంగాద్రి, వేణు రంగంలోకి దిగారు. గతంలో ధర్మవరంలో మంత్రి సత్యకుమార్‌తో దిగిన ఒక ఫొటోను ఆయుధంగా చేసుకుని, మంత్రి వద్ద తమకు గట్టి పలుకుబడి ఉందని బాధితురాలు భర్త జయచంద్రను నమ్మించారు. మంత్రి వద్ద ‘శేషాద్రి’ అనే వ్యక్తి పీఏగా ఉన్నాడని, అతని ద్వారా పనులు చక్కబెడతామని నమ్మబలికి లక్ష రూపాయల డీల్ మాట్లాడారు. వీరి మాయమాటలు నమ్మిన జయచంద్ర విడతల వారీగా రూ. 71 వేలు ముట్టజెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా బదిలీ కాకపోవడంతో జయచంద్ర ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో డబ్బులు వెనక్కి ఇవ్వలేక, బాధితుడి నుంచి తప్పుకోవడానికి ఇంటర్మీడియట్ చదువుతున్న వేణు అడ్డదారి తొక్కాడు.
టెక్నాలజీపై ఉన్న అవగాహనతో చాట్ జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించి మంత్రి సత్యకుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా, అచ్చం ప్రభుత్వ ఉత్తర్వులను పోలి ఉండే నకిలీ బదిలీ పత్రాలను సృష్టించి బాధితుడికి ఇచ్చారు. అయితే ఆ పత్రాల్లోని సంతకం, వివరాలపై అనుమానం వచ్చిన జయచంద్ర లోతుగా ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మంత్రి వద్ద శేషాద్రి అనే పీఏ ఎవరూ లేరని, ఆ ఉత్తర్వులు పచ్చి అబద్ధమని తేలడంతో బాధితుడు షాక్‌కు గురయ్యారు. మోసపోయానని గ్రహించిన జయచంద్ర తనకల్లు పోలీసులను ఆశ్రయించగా, ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి నిందితులు గంగాద్రి, వేణులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చిన పోలీసులు, టెక్నాలజీని తప్పుడు పనులకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఘటన ప్రస్తుతం అధికారుల వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Anantapur,Andhra Pradesh
Apr 30, 2026 11:12 PM IST



