ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra


. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1
. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతు న్నారు. అమరావతిలో 44.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, తిరుపతి జిల్లా బేస్తపల్లి, వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44, అన్నమయ్య జిల్లా నూలివీడులో 43.1, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43, కర్నూలు జిల్లా కల్లూరు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, కాకినాడ జిల్లా కరపలో 42.4,శ్రీసత్యసాయి జిల్లా ముడిగుబ్బ 42.3, మన్యం జిల్లా బూర్జ, అనంతపురంలో 42.2, శ్రీకాకుళం జిలా కొత్తూరు, విజయనగరం జిల్లా రాజాంలో 41.7, బాపట్ల జిల్లా మార్టూరులో 41.6, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో 41.5 డిగ్రీల చొప్ప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతలతో పాటు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *