Last Updated:
కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
Tirupati: తిరుపతి జిల్లాలో బుధవారం ఒక భయంకరమైన విషాదం చోటుచేసుకుంది. ఏ పాపం తెలియని ఒక కుటుంబం మొత్తాన్ని మృత్యువు కబళించింది. కన్నతల్లిని, కట్టుకున్న భార్యను హతమార్చిన ఓ వ్యక్తి, ఆపై తన ఇద్దరు బిడ్డలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ ఐదు మరణాలు యావత్ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేశాయి.
ఈనాడు కథనం ప్రకారం.. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ స్థానికంగా సిమెంట్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య హరిత (33) టైలరింగ్ షాప్ నడుపుతోంది. వీరికి కౌశిక్ (14), హరిణి (12) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోహన్ తల్లి చంద్రకళ (65) కూడా వారితోనే ఉంటోంది.
బుధవారం మధ్యాహ్నం మోహన్ తన దుకాణం నుండి భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. అక్కడ తన తల్లి చంద్రకళను, భార్య హరితను చున్నీతో మెడకు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం, ఏమీ ఎరగనట్లు నేరుగా పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్లాడు. తన మామ చనిపోయాడని అబద్ధం చెప్పి, పాఠశాల యాజమాన్యం నుండి పిల్లలను తీసుకుని తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
మధ్యాహ్నం నుండి మోహన్ ఫోన్ స్విచాఫ్ రావడంతో అతడి బావ బాలకృష్ణ అనుమానంతో ఇంటికి వెళ్లి చూడగా, హరిత, చంద్రకళ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు మోహన్ కోసం గాలింపు చేపట్టారు. రాత్రి 7:15 గంటల సమయంలో పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ తన వాహనాన్ని ఆపి, పిల్లలతో కలిసి పట్టాల వద్దకు వెళ్లాడు.
అక్కడ మోహన్ ఒక్కసారిగా పట్టాలపై తల పెట్టగా, అది చూసి పిల్లలు నిర్ఘాంతపోయారు. “నాన్న చనిపోవద్దు.. పక్కకు రా” అంటూ ఆ ఇద్దరు చిన్నారులు తమ తండ్రిని పట్టాలపై నుండి పక్కకు లాగే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 100 కి.మీ వేగంతో దూసుకొచ్చిన ఎగ్మోర్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు వారు ముగ్గురినీ బలితీసుకుంది. తండ్రిని కాపాడబోయిన ఆ చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కన్నీరుమున్నీరు చేసింది.
ఈ సామూహిక మరణాలకు గల కారణం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. స్థానికుల కథనం ప్రకారం.. మోహన్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కుటుంబంలో కూడా పెద్దగా గొడవలు జరిగిన దాఖలాలు లేవు. బుధవారం ఉదయమే తన సోదరి అప్పుల కోసం కొంత నగదును తెలిసిన వ్యక్తికి ఇచ్చాడని సమాచారం. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలో, మోహన్ ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? తన కన్నతల్లిని, భార్యను ఎందుకు చంపాడు? అనేది పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది.
తిరుపతి జిల్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. మోహన్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడమా లేక ఎవరికైనా తెలియని రహస్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకే రోజులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో నారాయణవనం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Apr 23, 2026 10:38 AM IST



