తిరుమలలో పద్మావతి పరిణయోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.

తిరుమల నారాయణగిరి: శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నారాయణగిరి ఉద్యానవనాలు భూలోక వైకుంఠంగా సుహాసిలమయ్యాయి. దశావతార, అష్టలక్ష్మి మండపాలు పుష్పాలంకృతమై కళకళలాడుతున్నాయి.

కలియుగంలో ధర్మసంస్థాపనార్థం వెలసిన శ్రీ వేంకటేశ్వరుడు నిత్యోత్సవ ప్రియుడని భక్తులు విశ్వసిస్తారు. ఈ వేడుకల్లో శ్రీవారిని నవ వరుడిగా, పద్మావతి దేవిని నవ వధువుగా దర్శించడం అరుదైన పుణ్యఫలంగా భావిస్తారు. వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగిన దివ్య కల్యాణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992 నుండి ఈ వేడుకలు తిరుమల నారాయణగిరిలో జరుగుతున్నాయి.

మొదటి రోజున శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై శోభాయాత్రగా విచ్చేయగా, ఉభయనాంచారులు పల్లకీల్లో పరిణయ మండపానికి చేరుకున్నారు. పెండ్లిమండపంలో ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట వంటి వేడుకలు జరిగాయి. స్వామివారి ఆస్థానం, కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా సాగింది.

అనంతరం భక్తులకు వస్త్రాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. రాబోయే రెండు రోజుల వేడుకల కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *