విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఉన్న శాప్ అకాడమీల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడమే కాకుండా, ఉచిత వసతి పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాలను కల్పించనున్నారు.
12 రకాల క్రీడల్లో శిక్షణ – మొత్తం 12 రకాల క్రీడలను ఎంపిక చేసి, ఒక్కో నగరంలో ప్రత్యేక విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
తిరుపతి కేంద్రంలో ఇక్కడ బ్యాడ్మింటన్, జూడో, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో బాలురు, బాలికలకు శిక్షణ ఉంటుంది. అలాగే బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో కేవలం బాలికలకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
కాకినాడ కేంద్రంలో వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో క్రీడల్లో బాలికలకు మాత్రమే ప్రత్యేకంగా అకాడమీ శిక్షణను కేటాయించారు. విశాఖపట్టణం కేంద్రంలో కొమ్మాది మైదానం వేదికగా అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్ విభాగాల్లో బాలురకు శిక్షణ ఇస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ: ఈ శిక్షణ శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారుల వయస్సు 15 నుంచి 19 ఏళ్లలోపు ఉండాలి. అంటే 2008 జనవరి 1వ తేదీ నుంచి 2011 జనవరి 1వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ ఎంపికలకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.sports.ap.gov.in లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
ఎంపిక సమయంలో తీసుకువెళ్లాల్సిన పత్రాలు: ఎంపిక ప్రక్రియకు వచ్చే అభ్యర్థులు తమ వెంట గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు తమ క్రీడకు సంబంధించిన కిట్‌ను తప్పనిసరిగా తీసుకురావాలి.
జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను వడపోసే ఈ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.
తిరుపతి: ఏప్రిల్ 26 (జూడో, బ్యాడ్మింటన్), 27 (బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్), 28 (రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్). కాకినాడ: ఏప్రిల్ 29 (వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్), 30 (హాకీ, ఖోఖో). విశాఖపట్టణం: మే 4 (అథ్లెటిక్స్), 5 (సైక్లింగ్), 6 (వాటర్ స్పోర్ట్స్).
ఈ శిక్షణ ద్వారా గ్రామీణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. క్రీడల్లో రాణించాలనుకునే యువతకు ఇదొక గొప్ప వేదిక. కాబట్టి, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


