వడివడిగా పోలవరం జలవిద్యుత్


. భారీ టర్బైన్ల వినియోగం
. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు
. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం
. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే మహత్తర జలవిద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇది కావడం గమనార్హం. 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ జలవిద్యుత్ ప్రాజెక్టులో మొత్తం 12 విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ 80 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. దేశ స్థాయిలో రూపొందుతున్న అతిపెద్ద హైడ్రో పవర్ కేంద్రాలలో ఇది û ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టులో భారీ వర్టికల్ కాప్లాన్ టర్బైన్ల వినియోగం ప్రత్యేకత. ప్రతి యూనిట్ సెకనుకు 331 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహాన్ని స్వీకరించేలా, నిమిషానికి 100 సార్లు తిరిగేలా రూపొందించబడింది. ఈ భారీ టర్బైన్లు దేశంలోనే అతిపెద్ద కాప్లాన్ టర్బైన్ యూనిట్లలో ఒకటిగా గుర్తింపు పొందనున్నాయి. నదీ ప్రవాహం మారుతూ ఉండే పరిస్థితుల్లో కూడా అధిక సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయగలగడం వీటి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో గోదావరి నదిలో అధికంగా వచ్చే నీటిని వినియోగించుకోవడం, అలాగే డెల్టా సాగునీటి అవసరాల కోసం విడుదలయ్యే నీటిని కూడా విద్యుత్ ఉత్పత్తికి మలచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని వల్ల రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ మరింత బలపడటంతో పాటు, విద్యుత్ వినియోగానికి డిమాండ్ సమయాల్లో కూడా స్థిరమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతుంది.ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత రోజుకు సుమారు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలదు. ఇందుకు రోజుకు సుమారు 12 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. సంవత్సరానికి దాదాపు 2,500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించారు.
ఆర్థిక పరంగా కూడా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడనుంది. యూనిట్‌కు సగటు విద్యుత్ ధర రూ.4.57గా అంచనా వేయగా, ప్రతి సంవత్సరం రూ.1,100 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల బయట రాష్ట్రాల నుంచి ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టులో దేశంలోని ప్రముఖ సంస్థలు భాగస్వామ్యమవుతున్నాయి. టర్బైన్లు, జనరేటర్లు వంటి ఎలక్ట్రో-మెకానికల్ పరికరాలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సరఫరా చేస్తుండగా, అధునాతన సబ్‌స్టేషన్ వ్యవస్థలను సీమెన్స్ ఎనర్జీ సంస్థ అందిస్తోంది. నిర్మాణ బాధ్యతలను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌స్ట్రాస్టక్చర్ లిమిటెడ్ చేపడుతోంది. ప్రస్తుతం సివిల్ పనులు, యంత్రాల అమరిక పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అవసరమైన పరికరాలు దశలవారీగా ప్రాజెక్టుకు చేరుతుండటంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.ఏపీ జెన్‌కో ప్రాజెక్టు అధికారులు తెలిపిన ప్రకారం 2027 జూలై నాటికి కనీసం మూడు యూనిట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుని, గోదావరి పుష్కరాల సమయానికి ప్రారంభం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తం ప్రాజెక్టును 2028 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి శక్తివంతమైన పునాది అవుతుందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది నిజంగా ఒక మహా శక్తి ఇంజిన్‌గా నిలవనుందని జెన్‌కో అధికారులు చెపుతున్నారు.

The post వడివడిగా పోలవరం జలవిద్యుత్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *